Friday, March 29, 2024

Telangana: చేపల పెంపకంలో తెలంగాణ టాప్​.. చెరువులు, కుంటలపై పూర్తి హక్కులు మత్స్యకారులకే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మంచినీటి వనరుల్లో (ఇన్‌లాండ్‌) చేపల పెంపకం లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. అన్ని వసతులతో కూడిన హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ను కోహెడ వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలపై మత్స్యకారులకే పూర్తి హక్కులు ఉన్నాయని, దళారుల పెత్తనాన్ని సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని హరితప్లాజాలో తెలంగాణ మత్స్యశాఖ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… మత్స్యకారులు తక్కువ ధరకే చేపలు అమ్ముకోకుండా సబ్సీడీపై వాహనాలతోపాటు ఫిష్‌ ఔట్‌లెట్‌ వాహనాలను సబ్సీడీపై సమకూర్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకుని ఆర్థికంగా, వృత్తిపరంగా అభివృద్ధి చెందాలని మత్స్యకారులకు పిలుపునిచ్చారు. 2014కు ముందు తెలంగాణ ప్రాంతంలో మత్స్యరంగం పూర్తిగా నిరాధరణకు గురైందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అన్ని నీటి వనరుల్లో ఉచితంగా చేపపిల్లలను వదులుతున్నామన్నారు. 2014కు ముందు 1.90లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో మత్స్య సంపద 4 లక్షల టన్నులకు చేరిందన్నారు.

ప్రతి ఏటా జూన్‌ 7, 8, 9 తేదీల్లో జిల్లాల్లోయ మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపలు, రొయ్యలతో చేసిన వివిధ రకాల వంటకాలను ఫుడ్‌ ఫెస్టివల్‌ ద్వారా ప్రజలకు పరిచ యం చేస్తున్నట్లు చెప్పారు. మత్స్య సొసైటీలు, మత్స్యకారుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడం కోసం ఒక కమిటీని నియమించినట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా అపరి ష్కృతంగా ఉన్న సమస్యలను ఈ కమిటీ పరిష్కరించిందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు మత్స్య సొసైటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మత్స్యకారుడికి సొసైటీలో సభ్యత్వం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 3.50లక్షల మందితో 5వేల మత్స్య సొసైటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం 6 ఉత్తమ మత్స్య, పారిశ్రామిక సహకార సంఘాలకు మెమెంటోలను అందజేశారు. ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ఏర్పాటు చేసిన 15 నూతన సొసైటీలకు రిజి స్ట్రేషన్‌ సర్టిఫికెట్‌లను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement