Friday, April 19, 2024

విభజన స‌మ‌స్య‌ల‌పై భేటీ, నివేదికలతో తెలంగాణ‌ రెడీ.. పెండింగ్‌ బకాయిలపై రానున్న స్పష్టత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు తెరపైకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం నివేదికలతో సిద్దమవుతోంది. ఈ నెల 27న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే భేటీకి ప్రభుత్వం నివేదికలు రెడీ చేస్తోంది. పలు సమస్యల పరిష్కారం దిశగా జరిగే సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై సీఎస్‌ నేతృత్వంలో అధికారులు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజనతోపాటు విద్యుత్‌ బకాయిలపై ఈ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు ఇప్పటికే ఆహ్వానం అందింది. పరిష్కారానికి నోచకుండా సమస్యలకు కారణమవుతున్న అంశాలపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం దిశగా కేంద్రం కృషి చేయనుంది.

గతేడాది కూడా కరోనా సమయంలో విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ వర్చువల్‌ విధానంలో రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశమై పరిష్కార మార్గాల దిశగా చర్చించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాల్లో ఇంకా ప్రతిస్టంభన నెలకొంది. తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన, విద్యుత్‌ బకాయిలపై రెండు రాష్ట్రాల నడుమ ఏకాభిప్రాయం రావడంలేదు. దీంతో అపరిష్కృతంగా పలు సమస్యలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 27న జరిగే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

సింగరేణి కార్పొరేషన్‌తోపాటు సంస్థకు అనుబంధంగా ఉన్న ఏపీ హెవీ మిషనరీ అండ్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌(అప్మెల్‌) విభజనలో పలు సమస్యలు నెలకొన్నాయి. అయితే విభజన చట్టం మేరకు ఏ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని అటర్నీ జనరల్‌ ఇటీవలే న్యాయసలహా ఇవ్వడంతో ఈ వివాదం తొలగనుందనే అంచనాలున్నాయి. ఈ సలహాను ఇరు రాష్ట్రాలు పరిశీలించి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక షీలాబీడే కమిటీ సిఫార్సుల్లో భాగంగా తొమ్మిదో షెడ్యూల్‌లోని అభ్యంతరాలులేని అంశాలపై ముందుకు వెళ్‌లే అవకాశాలున్నాయి. మిగిలిన సమస్యాత్మక అంశాలపై విడిగా చర్చించేందుకు సిద్దమని తెలంగాణ పేర్కొంటోంది.

అయితే అన్ని అంశాలలు, సంస్థల విషయంలో ఒకే విధంగా ముందుకు వెళ్దామని ఏపీ చెబుతోంది. ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్పా మిగతావాటి విషయంలో సీలాబీడే కమిటీ సిఫార్సుల మేరకే నడచుకోవాలని కేంద్రం సూచిస్తోంది. దీనిపై తెలంగాణ అభ్యంతరాలతో కూడిన నివేదికను రెడీ చేస్తోంది. పదో షెడ్యూల్‌లోని ఏపీ ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ వంటి సంస్థల విభజనపై కేంద్ర హోంశాఖ ఆదేవాలు, సుప్రీంకోర్టు తీర్పులపై ఇరు రాష్ట్రాలు భిన్నాభిప్రాయంతో ఉన్నాయి. దీంతో ఈ విషయమై న్యాయసలహా కోరుతూ కేంద్ర హోంశాఖ ఈ అంశాన్ని పక్కనపెట్టింది. ఢిల్లిలోని ఏపీ భవన్‌ విభజన సామరస్యంగా పరిష్కరించేందుకు కేంద్రం సిద్దమవుతోంది.

- Advertisement -

ఇక‌.. విద్యుత్‌ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వంనుంచి ఏపీకి రూ. 7500కోట్లు రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వ వాదనగా ఉంది. ఎన్సీఎల్టిలో దాఖలు చేసిన కేసు ఉపసంహరించుకుంటే ఈ వివాదం పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వాదిస్తోంది. ఏపీనుంచి కూడా తెలంగాణకు రావాల్సిన బకాయిలపై నివేదిక అందించనుంది. అయితే ఏపీ ప్రభుత్వం కోరుతున్న అండర్‌ టేకింగ్‌ తమకు కూడా ఇవ్వాలని తెలంగాణ పేర్కొంటోంది. అదేవిధంగా పన్ను బకాయిలు, పంపిణీలు, సంస్థల విభజనపై ఈ సమావేశంలో పురోగతి రానుందని తెలుస్తోంది. కొత్త ఏడాదిలోనైనా ఇరు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు తీరి, సుహృద్భావంతో తెలుగు రాష్ట్రాల అభివృద్ది దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ సమావేశంలో పెండింగ్‌ సమస్యలపై ద్వైపాక్షిక సమావేశంతో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement