Wednesday, April 24, 2024

గులాబీ వనంలో డ్రగ్స్ మొక్కలు.. ఎవరా ఎమ్మెల్యేలు?

తెలంగాణలో మరోసారి డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. కర్నాటక డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రమేయం ఉందన్న వార్తలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తొలుత సినీ రంగానికే పరిమితమైందనుకున్న ఈ కేసు.. రాజకీయ నేతల చుట్టూ తిరుగుతోంది. ప్రధానంగా తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఈ రాకెట్తో సంబంధాలున్నాయని గుర్తించిన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓ ఎమ్మెల్యేకు సంబంధించి ఆధారాలు దొరియాయని, త్వరలోనే కర్నాటక పోలీసులు నోటీసులు పంపిస్తారని తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. రేపో, మాపో వారిని పిలిచి విచారించే అవకాశముంది. కర్ణాటకకు చెందిన ఎక్సైజ్ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం.

ఇటీవల బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ బయటపడింది. దానిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖలను విచారించారు. తెలుగు నటుడు తనీష్ ను కూడా పిలిచి ప్రశ్నించారు. వారందరూ ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో ఇప్పుడు నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు, వ్యాపారస్థుల పేర్లు బయటకు బయటకు వస్తున్నాయి. బెంగళూరు డ్రగ్స్ రాకెట్ మూలాలు హైదరాబాద్లో కనిపిస్తుండటంతో పోలీసులు ఇక్కడ ఫోకస్ పెట్టారు. సరైన ఆధారాలతో సంపాధించిన తర్వాతే ప్రముఖులను అరెస్టు చేయాలని చూస్తున్నారు.

ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, పలువురు బిల్డర్లు, ఒక పారిశ్రామిక వేత్త చుట్టూ తిరుగుతోంది. అయితే, ఈ కేసు వివరాలను ఇప్పుడప్పుడే వెల్లడించలేమని సీసీబీ అధికారులు చెబుతున్నారు. ప్రముఖ కన్నడ సినీ నిర్మాత శంకరగౌడ ఏర్పాటు చేసిన ఓ విందులో తెలుగు నటుడు తనీశ్ పాల్గొన్నట్టు.. అందులో మాదకద్రవ్యాల సరఫరా జరిగిందని గుర్తించారు.

ఈ కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న వికారాబాద్, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్కు చెందిన ముగ్గురు ప్రముఖులకు లింకులున్నట్టు సమాచారం. ఇదే కేసులో 8 మంది ఈవెంట్ మేనేజర్ల పాత్రపైనా సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.

బెంగళూరులో జరిగిన డ్రగ్స్ పార్టీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరైనట్లుగా కర్ణాటక పోలీసుల విచారణలో తేలింది. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. శాండిల్ వుడ్ నిర్మాత శంకర్ గౌడ్ అరెస్ట్ తరువాత మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీలకు నిర్మాత శంకర్ గౌడ్ మత్తు మందు సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. డ్రగ్స్ తో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -

తొలుత ముంబైలో బాలీవుడ్ను కుదిపేసిన డ్రగ్స్ రాకెట్ కలకలం.. ఆ వెంటనే శాండల్వుడ్లో సంచనంగా మారింది. గత మార్చి 6న బెంగళూరు పోలీసులు 8 మంది విదేశీయులతోపాటు వారికి సహకరిస్తున్న మరో ఇద్దరిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. వారి నుంచి 350 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్స్, 4 గ్రాముల కొకైన్, 82 గ్రాముల ఎక్ట్ససీ పిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారిస్తే మార్చి 24న ఇంకో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఈ రెండు కేసుల్లో నైజీరియన్ల మొబైల్ ఫోన్లు,లాప్ టాప్ లను బెంగళూరుపోలీసులు విశ్లేషించారు. అందులో.. తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, బిల్డర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. హైదరాబాద్కు చెందిన సందీప్ రెడ్డి, కలహర్రెడ్డి బెంగళూరులో పబ్లను నిర్వహిస్తున్నట్లు తేలింది. వీరిద్దరూ తెలంగాణకు చెందిన ప్రముఖులతో పార్టీల్లో పాల్గొన్నట్లు గుర్తించారు.

ఇటీవల బెంగళూరులో పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్స్తో హైదరాబాద్కు చెందిన సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డి అనే వ్యక్తులకు సంబంధాలు ఉన్నట్లు తేలింది. వీరు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడయింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కర్నాటక పోలీసులు కూపీ లాగుతున్నారు. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్తో హైదరాబాద్ శివారులో ఓ ఫామ్హౌస్లో పార్టీలు చేసుకున్నారని, ఆ పార్టీలకు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారని బెంగళూరు పోలీసులు తెలిపారు. అలా పలుమార్లు బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలించాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ప్రమేయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

మరోవైపు డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో సీఎం కేసీఆర్కు తెలుసని.. వారికి డ్రగ్స్ టెస్ట్లు చేయించే దమ్ముందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో కరోనా టెస్ట్లకు బదులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్ట్లు చేయాలని డిమాండ్ చేశారు. కర్నాటక డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో కేసీఆర్కు తెలుసని, వారితో వెంటనే రాజీనామా చేయించాలని బండి డిమాండ్ చేశారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారని ఆరోపించారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వేళ.. ఈ డ్రగ్స్ వ్యవహారం అధికార టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఆ నలుగురు ఎమ్మెల్యే ఎవరు ? అన్న దానిపై సర్వత్ర చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ స్పందించలేదు. గ్రడ్స్ కేసులో ఎమ్మెల్యేల పాత్ర ఉందని నిర్ధారణ అయితే, ఈ కేసు మరో మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్లో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసును పరపతి ఉపయోగించి కొంతమంది విజయవంతంగా తొక్కేశారు. తాజా కేసులో బయటపడని ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఏ పార్టీకి చెందిన వారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement