Thursday, April 25, 2024

తెలంగాణ పారిశ్రామిక విధానాలు అద్భుతం : గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్‌

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని, పలు రాష్ర్టాల నేతలు తెలంగాణ విధానాలను ప్రశంసించడమే కాకుండా.. తమ ప్రభుత్వాల ద్వారా అమలు చేసేందుకు ముందుకువస్తుండటమే ఇందుకు నిదర్శనం. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు కూడా తెలంగాణ విధానాలను ప్రశంసించడం విశేషం. తాజాగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ తెలంగాణ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ పారిశ్రామిక నమూనా తనను ఎంతగానో ఆకట్టుకొన్నదని చెప్పారు. గోవాలో ఆ విధానాలను అమలు చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. పణజీలో గురువారం గోవా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ సమావేశంలో ప్రసంగిస్తూ తెలంగాణ విధానాలపై ప్రశంసలు కురిపించారు. గోవా పారిశ్రామిక రంగంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి అడ్డంకులు లేని సులభ వాణిజ్య విధానం తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదే తరహా విధానాలను గోవాలో ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి విస్పష్టంగా ప్రకటించడం గమనార్హం. పొద్దున లేస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలే లోకల్‌ బీజేపీ నాయకులు దీనిపై ఏమంటారో వేచి కూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement