Thursday, April 18, 2024

అంబులెన్సులు ఆపడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాల నుండి హైద‌రాబాద్ వ‌స్తున్న అంబులెన్సుల‌ను ఆప‌టంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాజ్యాంగంలోని 21 ఆర్టిక‌ల్ ప్ర‌కారం జీవించే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంద‌ని, వారిని వారు కాపాడుకునేందుకు వెళ్తే ఎలా అడ్డుకుంటార‌ని ప్ర‌భుత్వాన్ని కోర్టు ప్ర‌శ్నించింది. అంబులెన్సులు ఆప‌వ‌ద్ద‌ని చెప్పినా ప‌ట్టించుకోరా అని మండిప‌డ్డ కోర్టు రాజ్యాంగాన్ని మీరే మారుస్తారా అని మండిప‌డింది. దేశంలో ఇలాంటి స‌ర్క్యూల‌ర్ ఎక్క‌డా లేద‌ని, రాజ్యాంగం క‌న్నా మీ ఆదేశాలే గొప్ప అంటూ తీవ్రంగా స్పందించింది.

తాము చికిత్స అందించ‌లేమ‌ని చెప్ప‌లేద‌ని, బెడ్స్ బుక్ చేసుకుని అనుమ‌తితో రాష్ట్రంలోకి రావాల‌ని కోరిన‌ట్లు ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని కేసుల‌ను బ‌ట్టి లైఫ్ సేవింగ్ డ్ర‌గ్స్, ఆక్సిజ‌న్ కేటాయింపులు ఉంటున్నాయ‌ని, కానీ నాలుగు రాష్ట్రాల నుండి తెలంగాణ‌కు వ‌స్తే ఇక్క‌డ మ‌రింత కొర‌త ఏర్ప‌డుతుంద‌ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇప్ప‌టికే చాలా రాష్ట్రాలు ఇచ్చాయ‌ని, తెలంగాణ కూడా ఇటీవ‌ల ఇచ్చింద‌ని ఏజీ తెలిపారు. తెలంగాణ పౌరుల బాధ్య‌త త‌మ‌పై ఉంద‌ని ఏజీ కోర్టుకు తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాలు పాజిటివ్ ఉన్న వారిని తమ రాష్ట్రాల్లోకి రానివ్వ‌టం లేద‌ని, అంబులెన్సుల్లో తెలంగాణ‌కు వ‌చ్చే వారంతా పాజిటివ్ వ‌చ్చిన వారేన‌ని హెల్త్ సెక్ర‌ట‌రీ కోర్టుకు తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement