Sunday, March 24, 2024

రామప్పపై నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది: హైకోర్టు

యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన రామప్ప దేవాలయ సంరక్షణపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. మీడియా కథనాలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు కీలక ఆదేశాలు జరీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం యునెస్కో విధించిన గడువులోగా రామప్ప శిల్పకళా సంరక్షణ చేపట్టాలని ఆదేశాలిచ్చింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  యునెస్కో విధించిన గడువు డిసెంబరు నెలాఖరు వరకు సమగ్ర సంరక్షణ కార్యక్రమం చేపట్టాలని తెలిపింది. ఏఎస్ఐ, రాష్ట్ర పురావస్తు శాఖ, కలెక్టర్ లతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆగష్టు 4న కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని పేర్కొంది. క్షేత్ర స్థాయిలో సంయుక్త పరిశీలన జరపాలన్న హైకోర్టు… నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం తెలంగాణకు గర్వకారణమని కోర్టు పేర్కొంది. ప్రపంచపటంలో నిలవడం గర్వ కారణమని వ్యాఖ్యానించింది. రామప్ప సమగ్ర సంరక్షణకు వెంటనే కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర పురావస్తు శాఖ, కలెక్టర్, పోలీసులతో కూడాని కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని.. ఆగస్టు 4వ తేదీలోపు సదరు కమిటీ తొలి విడత సమావేశం కావాలని నిర్దేశించింది.

క్షేత్రస్థాయిలో పరిశీలించి.. వారసత్వ సంపద సంరక్షణలకు చేపట్టాల్సిన చర్యలపై నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. రామప్ప వారసత్వ కట్టడాన్ని ప్రపంచ అంచనాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని.. రామప్ప ఆలయం ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుందని న్యాయస్థానం పేర్కొంది. వారసత్వ సంపత సంరక్షణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. రామప్ప అభివృద్ధి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కాలపరిమితులు విధించుకొని పని చేయలని తెలిపింది. తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వం: కోమటిరెడ్డి వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement