Thursday, April 25, 2024

తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్ ఛార్జీలు!

తెలంగాణలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగనున్నాయి. మంగళవారం ఆర్టీసీ, విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ ఛార్జీల పెంపుపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. కరోనాతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై ఆర్థిక భారం అయినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లాక్ డౌన్ల వల్ల ఆర్టీసీ సంస్థ సుమారుగా రూ. 3 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోయిందని వివరించారు. కేవలం హైద్రాబాద్ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు ఆర్థిక నష్టం కలుగుతున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతను సీఎం కేసీఆర్‌కు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి, ఎంపీ సజ్జనార్ సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు కోరారు. తెలంగాణ ప్రభుత్వం చివరిసారిగా 2019 డిసెంబరులో ఛార్జీలు పెంచింది. అప్పట్లో కనీస ఛార్జీని రూ. 5 నుంచి రూ. 10కి, మొత్తంగా ఛార్జీలను 20 శాతం వరకు పెంచింది. దాంతో ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ. 4 కోట్ల మేరకు పెరిగింది. అయితే 2020 మార్చిలో లాక్‌డౌన్‌ ప్రారంభం కావటంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

అనంతరం బస్సులు మళ్లీ రోడ్లెక్కినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ డిపోలకే చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ అదుపులోనే ఉంది. దీంతో పూర్తి స్థాయిలో బస్సులను నడిపిస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఆదాయం పుంజుకుంటోంది. ఇటీవల రోజువారీ ఆదాయం రూ. 13 కోట్లు దాటింది. అయినప్పటికీ డీజిల్‌, విడిభాగాల ధరలు పెరగడంతో వచ్చే ఆదాయం నిర్వహణకు కూడా సరిపోవడం లేదు. దీంతో ఈసారి కనీసం 10-20 శాతం మేరకు ఛార్జీలు పెంచాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. 20 శాతం ఛార్జీలు పెంచితే రోజువారీ ఆదాయం రూ. 6 నుంచి రూ. 7 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏడాదిలో కనీసం 175 రోజుల పాటు ఆ మేరకు ఆదాయం వస్తే రూ. వెయ్యి కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైన సమయంలోనే కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. గత మార్చి 2020 అసెంబ్లీలోనే ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రకటించిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, కరోనా కారణంగా చార్జీలను పెంచలేదని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: వెదర్ అలర్ట్: మరో మూడు రోజులు భారీ వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement