Thursday, April 18, 2024

Telangana: ఉద్యోగుల విభజనపై నేటి నుంచి ఆప్షన్స్‌..

తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల విభజన ప్రక్రియలో భాగంగా నేటి నుంచి ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో ఈ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి డిసెంబర్ 6న రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసి షెడ్యూల్‌ జారీచేసింది. దీనిప్రకారం ఈ నెల 15వ తేదీ నాటికి ఉద్యోగుల విభజనను పూర్తి చేయనున్నది.

షెడ్యూల్‌ ప్రకారం నేడు(డిసెంబర్ 9) ఉద్యోగుల నుంచి జిల్లాల ఆప్షన్లు స్వీకరిస్తారు, 10న సీనియారిటీ జాబితాను అప్‌డేట్‌ చేయడంతోపాటు ఉద్యోగుల ఆప్షన్లను కమిటీ పరిశీలిస్తుంది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జిల్లా స్థాయి ఉద్యోగుల కేటాయింపుపై కమిటీ సమావేశాలు నిర్వహించనున్నది. కమిటీ నిర్ణయాల ప్రకారం ఈ నెల 15న ఉద్యోగులకు ఆయా జిల్లాలు కేటాయిస్తూ ఆదేశాలు జారీచేస్తుంది. ఉత్తర్వులు అందుకున్న ఉద్యోగులు కొత్త జిల్లాల్లో చేరేందుకు 15వ తేదీ నుంచి వారం పాటు సమయం ఇచ్చింది.

ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని జిల్లాల కేడర్​లను ఉద్యోగులు ప్రాధాన్య క్రమంలో ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక కేటగిరీలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను కూడా జతచేయాలి. ప్రాధాన్యాలకు అనుగుణంగా సీనియారిటీ, ప్రత్యేక కేటగిరీలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తారు. జిల్లా కేడర్​తో పాటు జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు సంబంధించిన ప్రక్రియను కూడా నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. 

అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోలేని జిల్లాలకు మాత్రమే షెడ్యూల్‌ వర్తిస్తుంది. కోడ్‌ ఉన్న జిల్లాలకు ప్రత్యేకంగా మరోసారి షెడ్యూల్‌ జారీ చేయనున్నారు. పీవో-1975 ప్రకారం రాష్ట్రంలో పది జిల్లాల క్యాడర్‌లు, రెండు జోనల్‌ క్యాడర్‌లు ఉన్నాయి. ఇప్పుడు 9 ఉమ్మడి జిల్లాల క్యాడర్‌ను 32 యూనిట్లకు సర్దుబాటు చేయనున్నారు. ప్రతి జిల్లా క్యాడర్‌లో 70కి పైగా విభాగాలు, మూడొందలకు మించిన కేటగిరీలు ఉంటాయి. పాత రెండు జోన్లలోని ఉద్యోగులను కొత్తగా సృష్టించిన ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లలో సర్దుబాటు చేస్తారు. మూడు లక్షల మందికిపైగా ఉద్యోగులను శాశ్వతంగా కొత్త క్యాడర్‌లో సర్దుబాటు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement