Saturday, June 12, 2021

గుడ్ న్యూస్: రేషన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్నారా? కేబినెట్ నిర్ణయాలు ఇవే

కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రిమండలి సంబంధిత అధికారులను ఆదేశించింది.

రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కార మార్గాల సూచనకై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్ జిల్లా మినహా పాత తొమ్మిది జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టీఎస్ ఎఫ్.పి.జెడ్)  ఏర్పాటుకు క్యాబినెట్ అనుమతించింది. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

కాగా, తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా కొత్తగా పెన్షన్లతో పాటు రేషన్ కార్డులను జారీ చేయడం లేదు. అయితే తాజాగా ఈ అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంతో మరికొద్ది రోజుల్లోనే దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రజలకు రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News