Thursday, April 25, 2024

తెలంగాణలో లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు ఇవీ..

తెలంగాణలో కరోనా కేసులు  తగ్గినప్పటికీ లాక్‌డౌన్‌ను పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం.  తక్షణం అన్‌లాక్ చేస్తే ప్రజలు ఒక్కసారిగా ప్రజలకు బయటకు వస్తారని.. అందుకే దశల వారీగా అన్‌లాక్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సడలింపు సమయాన్ని పెంచారు.

కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ను పొడిగించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌  ఆదివారం రాత్రి మార్గదర్శకాలను విడుదల చేశారు. సోమవారం నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగింపు ఉంటుందని.. ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.

అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, ఇతర సంస్థలు మధ్యాహ్నం ఒంటి గంట వరకే మూసివేయాల్సి ఉంటుంది.  ఆర్టీసీ, సెట్విన్‌ బస్సులు, హైదరాబాద్‌ మెట్రో, ఆటోలు, క్యాబ్‌లకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే అనుమతి. అంతర్‌ రాష్ట్ర బస్సులు, ప్రైవేటు ఆపరేటర్ల వాహనాలకు అనుమతి లేదు.  హోం ఐసోలేషన్‌లో ఉండకుండా బయటికొస్తే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలిస్తారు. ఉద్యోగులు, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై కఠిన చర్యలుంటాయి.  గరిష్టంగా 40 మందితో వివాహాలకు, 20 మందితో అంతిమ సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలకు అనుమతి ఉంది. 

దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లోకి సందర్శకులకు అనుమతి లేదు.  అన్ని రకాల సామాజిక, రాజకీయ, మతపరమైన, క్రీడా, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం విధించారు.  అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేసినా.. గర్భిణులు, బాలింతలకు రేషన్‌ సరుకులు ఇవ్వాలి.  సినిమా హాళ్లు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, క్లబ్బులు, స్విమ్మింగ్‌ పూల్స్, బార్లు, పబ్బులు, జిమ్‌లు, స్టేడియంలు పూర్తిగా మూసివేయాలి. 

వైద్య సేవలు, వాక్సినేషన్‌ సంబంధిత కార్యకలాపాలు, ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, ఔషధ, వైద్య పరికరాల తయారీ రంగాలకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. వ్యవసాయ సంబంధిత పనులు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు రవాణా, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, ఇతర అత్యవసర సేవలు, మీడియా, ఇతర మినహాయింపు ఉన్న సర్వీసులు, ఉపాధి హామీ పథకం పనులను లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement