Friday, March 29, 2024

తెలుగు రాష్ట్రాల్లో పోటెత్తిన వరద.. ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తివేత!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టుల్లో జల కళ సంతరించుకున్నాయి. చాలా ప్రాంతాల్లో గేట్లను ఎత్తివేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఇన్‎ప్లో 2,17,572 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‎ఫ్లో 35,315 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా..ప్రస్తుతం 852.10 అడుగులుగా ఉంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. సాగర్ ఇన్ ఫ్లో 23,825 క్యూసెక్కులు కాగా… ఔట్ ఫ్లో 2,677 క్యూసెక్కులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 536.40 అడుగులకు చేరుకుంది. ఇక, ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో లక్షా 28 వేల క్యూసెక్కులు కాగా..  అవుట్ ఫ్లో లక్ష 25వేలు క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా డెల్టా తూర్పు, పడమర కాలువలకు 3,000 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజి 70 గేట్లు అడుగు మేరకు ఎత్తి నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు. నెల్లూరులోని సోమశిల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 53.38 టీఎంసీలుగా ఉంది.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల మారుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 35 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజీ 79 గేట్లను అధికారులు ఎత్తివేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఇన్‌ ఫ్లో, ఔట్ ఫ్లో 11,09,640 క్యూసెక్కులకు చేరుకుంది.

ఇక, గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో 5.70 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 175 గేట్లను అధికారులు ఎత్తివేశారు. సముద్రంలోకి 3.26 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. డెల్టాలకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండిః నిజామాబాద్ లో క్రిటికల్ కేర్ బెడ్స్.. యువరాజ్ కు మంత్రి కృతజ్ఞతలు

Advertisement

తాజా వార్తలు

Advertisement