Friday, April 26, 2024

జమున హేచరీస్ పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో జమునా హేచరీస్ సంస్థకు సంబంధించిన భూ వివాదంలో ప్ర‌భుత్వంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈటల భూముల్లో సర్వే జరిపిన తీరును హైకోర్టు తప్పుబట్టింది. చట్టప్రకారం నియమాలు, నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం ఆదేశాలు చేయడం, చర్యలు తీసుకోవడం చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. సహజ న్యాయసూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించారని పేర్కొంది. సర్వే చేసే ముందు నోటీసు ఇవ్వకపోవటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. జమున హేచరీస్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. అధికారులు చట్టప్రకారం వ్యవహరించవచ్చునని తెలిపిన హైకోర్టు.. కలెక్టర్ నివేదికతో సంబంధం లేకుండా చట్టప్రకారం వ్యవహరించవచ్చని పేర్కొంది. చట్టప్రకారం నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇవ్వాలని తెలిపింది. విచారణకు పిటిషనర్లు సహకరించకపోతే చట్టప్రకారం వ్యవహరించవచ్చని స్పష్టం చేసింది. హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణ జులై 6కు వాయిదా వేసింది.

అంతకు ముందు.. జమునా హేచరీస్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈటల కుటుంబం తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. జమునా హేచరిస్‌కు చెందిన కంపెనీ నిర్వహకులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పిటిషనర్ల భూముల పైన రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారని న్యాయవాది తెలిపారు. మీడియాలో వచ్చిన కథనాలను చూసి భూముల్లోకి వెళ్లారని న్యాయవాది ప్రకాష్ రెడ్డి కోర్టుకు తెలిపారు. కలెక్టర్ కూడా 24 గంటల్లో సర్వే చేసి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని తెలిపారు. 66 ఎకరాలు ఆసైన్డ్ భూమి అక్రమాలకు పాల్పడినట్లు కలెక్టర్ ప్రభుత్వానికి తెలిపారని వివరించారు. అంతా ప‌థ‌కం ప్ర‌కారం జ‌రిగింద‌ని, కుట్ర‌పూరితంగా చేశార‌ని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ధ‌ర‌ణి ప్ర‌కారం అందులో 58.37ఎక‌రాలు ప‌ట్టా భూములేన‌ని… స‌ర్వే నెం 130లోని 18 ఎకరాల్లో 3 ఎకరాల మేర ప‌ట్టా భూమి కూడా ఉందన్నారు. పౌల్ట్రీ ఫారం పెట్టాలన్న ఆలోచనలో భాగంగా 14 షెడ్లకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు వివరించారు.

అనంతరం దర్యాప్తు, సర్వే చేసే అధికారులు ముందుగా నోటీసులను జారీ చేశారా ? అని ప్రశ్నించి.. ఆ కాపీలను చూపించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని హైకోర్టు తెలిపింది. అధికారుల మాటలపై తమకు నమ్మకం లేదని, అందువల్ల లిఖితపూర్వకంగా వివరాలను సమర్పించాలని ఆదేశించింది. అసైన్డ్ భూముల ఆక్రమణ విషయంలో అధికారులు ఫీల్డు మీదకు వెళ్ళారా? లేక కారులోనే కూర్చుని నివేదికను తయారుచేశారా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 18 ఎకరాల భూమిని సర్వే చేయడానికి రెండు రోజులు పడుతుందంటూ ఒకవైపు అధికారులు చెప్తూనే 128 ఎకరాల భూమిని ఒక్క రోజులోనే ఎలా సర్వే చేయగలిగారని ప్రశ్నించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement