Thursday, April 18, 2024

హుజురాబాద్ లో టీడీపీ పోటీ?

తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక ఆసక్తి రేపుతోంది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ కూడా ఇంకా రాకముందే పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే, హుజురాబాద్ ఎన్నికల క్షేత్రంలోకి టీడీపీ కూడా దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో దాదాపు కనుమరుగైన టీడీపీ.. ఇప్పుడు మళ్లీ తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

రాష్ట్ర విభజన అనంతరం అనేక మంది పార్టీని వీడినా.. ఉన్న కొద్ది పాటి కార్యకర్తలతో పార్టీని నడిపిస్తున్నారు. అయితే, గత ఏడేళ్లు తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ సైతం సైకిల్ దిగి కారెక్కారు. దీంతో ఆపార్టీలో ఇక చెప్పుకోదగిన నాయకుడు లేకుండా పోయారు. అయితే, ఇప్పడు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ శాఖకు కొత్త అధ్యక్షుడిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులుకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్‌నగర్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.

టీడీపీ అంటే బీసీల పార్టీ అని పేరుంది. ఈ క్రమంలో దళిత సామాజికి వర్గానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితులను ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు. అయితే, అనంతరం ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా మారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో కేసీఆర్ టార్గెట్ గా చంద్రబాబు దళిత వర్గ నేతను తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిని చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం‌ కృషి చేస్తానని కొత్త అధ్యక్షుడు బక్కని నరసింహులు ప్రకటించారు. టీడీపీలో మాత్రమే దళితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు కష్టడి హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేస్తే కేసీఆర్ అనుభవిస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నేతలు పార్టీని వీడినా… తెలంగాణలో పార్టీకి  ప్రజల ఆదరణ ఉందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చంద్రబాబుదే తుది నిర్ణయమని నరసింహులు తెలిపారు.

హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలోనే బక్కనిని కొత్త అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించినట్లు తెలుస్తోంది. మాదిగ సామాజికవర్గానికి వ్యక్తి కావడంతో ఆవర్గం ఓట్లు తమకే పడతాయని చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో చరిత్రలు సృష్టించిన టీడీపీ.. ఇప్పుడు తన ఉనికి కోసం పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది. అయితే, హుజురాబాద్ లో పోటీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక పోటీ నుంచి తప్పుకోవాలని సూచిస్తారా? అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి: ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను ముట్ట‌డించిన లంబాడీ హ‌క్కుల స‌మితి

Advertisement

తాజా వార్తలు

Advertisement