Wednesday, April 24, 2024

తిరుపతిలో డైలాగ్ వార్.. వివేకా కేసు చుట్టూ రాజకీయం!

తిరుపతి ఉప ఎన్నిక  ప్రచారాలతో ఏపీలో రాజకీయాలు పూర్తిగా హీటెక్కాయి. తిరుపతి ఉప ఎన్నిక వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ వివాదాస్పదమవుతోంది. ఈ కేసుపై వైసీపీ, టీడీపీల మధ్య వార్ ముదురుతోంది. తిరుపతిలోని పవిత్ర స్థలమైన అలిపిరి దగ్గర రాజకీయ యుద్ధమే జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశంపై అధికార వైసీపీకి టీడీపీ సవాల్ విసురుతోంది. వివేకా హత్య కేసుతో తమ కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చేయటానికి సిద్దంగా ఉన్నానని, మరి జగన్ ఎక్కడ అని నారా లోకేష్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. దీంతో వైసీపీ మంత్రులు ఎదురు దాడికి దిగారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం పట్ల తిరుపతి గరుడ వారధి వద్ద ప్రమాణం చేసిన నారా లోకేష్‌కు.. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న వైఎస్ వివేకా హత్యోదంతాన్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ రాష్ట్రంలో ప్రవేశించకుండా నిషేధిస్తూ జీవోలను జారీ చేసిన టీడీపీకి.. ఇప్పుడదే సీబీఐ పేరును ఎత్తే అర్హత ఉందా అని ప్రశ్నించారు. నారా లోకేష్ ప్రమాణం చేయాల్సింది.. వైఎస్ వివేకా హత్యపై కాదని, అలాంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తన తాత ఎన్టీ రామారావును తండ్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి, పార్టీని లాక్కున్నారా? లేదా? అనే విషయం ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం నారా లోకేష్‌కు ఉందా? అని కన్నబాబు సవాల్ విసిరారు. తన మామ నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగలేదని నారా లోకేష్ అదే తిరుపతిలో ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం ఘాట్ల వద్ద తొక్కిసలాటకు చంద్రబాబు, నారా లోకేష్ కారణమని గుర్తు చేశారు.

పుష్కరాల్లో 29 మంది మృతికి కారణం తన కుటుంబం కాదని నారా లోకేష్ ప్రమాణం చేయగలరా అని ఎదురుదాడికి దిగారు. అవన్నీ వదిలేసి.. వైఎస్ వివేకా హత్యను రాజకీయ అవసరాల కోసం, తిరుపతి ప్రజల ఓట్ల కోసం వాడుకోవడం టీడీపీ దైన్యస్థితికి, నారా లోకేష్ దౌర్భల్యానికి అద్దం పడుతోందని కన్నబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి నారా లోకేష్‌కు లేదన్నారు. ఎద్దేవా చేశారు. వారిద్దరికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని  వ్యాఖ్యానించారు. ఓడిపోయిన లోకేశ్‌కూ, ఒంటి చేత్తో 151 మందిని గెలిపించుకున్న జగన్‌కు పోలిక ఏంటని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు.

మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికల వివేకా హత్య కేసు అంశంతో రాజకీయాలను వేడెక్కించింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement