Thursday, April 25, 2024

జోషీమ‌ఠ్‌పై అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు సుప్రీంకోర్టు నో..

జోషీమ‌ఠ్‌పై అత్య‌వ‌స‌ర విచార‌ణ చేప‌ట్టాల‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే అత్య‌వ‌స‌ర విచార‌ణ విజ్ఞ‌ప్తిని సుప్రీం తిర‌స్క‌రించింది. ఈ కేసును జ‌న‌వ‌రి 16వ తేదీ విచారించ‌నున్న‌ట్లు ఇవాళ‌ కోర్టు చెప్పింది. ముఖ్య‌మైన ప్ర‌తి అంశంపై సుప్రీంకు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆ అంశాల‌పై ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నికైన వ్య‌వ‌స్థ‌లు ప‌నిచేస్తున్నాయ‌ని కోర్టు తెలిపింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ పీఎస్ న‌ర‌సింహ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారిస్తున్న‌ది.

జోషీమ‌ఠ్ విష‌యంలో అత్య‌వ‌స‌ర విచార‌ణ చేప‌ట్టాల‌ని స్వామి అవిముక్తేశ్వ‌రానంద స‌ర‌స్వ‌తి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జోషీమ‌ఠ్ వాసుల‌కు తొంద‌ర‌గా ఆర్థిక సాయం చేయాల‌ని, న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని ఆ పిటిష‌న్‌లో డిమాండ్ చేశారు. ఉత్త‌రాఖండ్‌లోని జోషీమ‌ఠ్ ప‌ట్ట‌ణంలో ఇండ్లు కుంచించుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఇండ్లు, హోట‌ళ్లు, ప‌లు కట్ట‌డాల్లో ప‌గుళ్లు వ‌స్తున్నాయి. దీంతో కొన్ని ప్ర‌మాద‌క‌ర క‌ట్ట‌డాల‌ను తొల‌గించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అయితే సుప్రీంకోర్టు ఈకేసును ఈనెల 16న విచారించ‌నున్న‌ట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement