Friday, March 15, 2024

తెలంగాణలాంటి ప్రగతిశీల రాష్ట్రాలకు మద్దతు ఇవ్వండి: మంత్రి కెటిఆర్

తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. సోమవారం పీఎం గతి శక్తి సౌత్‌జోన్‌ వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ జరగ్గా.. కేటీఆర్‌ పాల్గొన్నారు. సదస్సుకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, హ్యాండ్లూమ్స్ అండ్‌ టెక్స్‌టైల్స్, పవర్, బొగ్గు తదితర రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను మంత్రి కేటీఆర్ వివరించారు.

ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో 35శాతం హైదరాబాద్‌లోనే జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తక్కువ రోజులైనా.. ‘తెలంగాణ భౌగోళిక వనరుల్లో సహజ ప్రయోజనాలు, ప్రపంచ స్థాయి నైపుణ్యం, ఇప్పటికే ఉన్న తయారీ పద్ధతులు, నైపుణ్యంతో పెట్టుబడులకు కొత్త అవకాశాలను తెరిచింది’ అన్నారు. అన్నిరంగాల్లో ముందుకెళ్తున్నా కేంద్రం నుంచి తెలంగాణకు తగిన సహకారం అందడం లేదంటూ కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంచి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణకు డిఫెన్స్‌ కారిడార్‌ ఇవ్వాలి..

హైదరాబాద్‌కు అనేక దశాబ్దాల చరిత్ర ఉందని, రక్షణ రంగానికి సంబంధించిన పటిష్టమైన వ్యవస్థ ఉందన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌కు డిఫెన్స్‌ కారిడార్‌ను ఇచ్చింది, అక్కడ ఎలాంటి వ్యవస్థ ఉనికిలో లేదని, సంస్థలు లేవన్న ఆయన.. తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డీఆర్‌డీఓ, డీఆర్‌ఎల్‌ఓ, డీఎంఆర్‌ఎల్, ఆర్‌ఎస్‌ఐ, అనురాగ్ తదితర రక్షణ సంస్థలకు తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఉందని, ఈ మధ్య కాలంలో అనేక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చుకుంటున్నాయన్నారు.

రాష్ట్రంలో చాలా అనుకూలమైన వ్యవస్థ ఉన్నందున డిఫెన్స్‌ కారిడార్‌ను కోరుతున్నామన్నారు. సరైన వ్యవస్థ లేకుండా కొత్త ప్రాంతానికి వెళ్లే ప్రణాళికలను అంతర్జాతీయ కంపెనీలు పునరాలోచించేలా చేస్తుందని, తద్వారా అవకాశాలను కోల్పోవచ్చన్నారు. లాజిస్టిక్ మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలను మంజూరు చేస్తే, రాష్ట్రం డ్రై పోర్ట్‌లు, ఇంటిగ్రేటెడ్ అండ్‌ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -

‘అసెంబ్లీ ఇన్‌ ఇండియా’గా.. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’

గూడ్స్ వేగంగా వెళ్లేందుకు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. నార్త్ సౌత్ ఫ్రైట్ కారిడార్ హైదరాబాద్ ప్రాంతాన్ని తాకకుండా తెలంగాణ మీదుగా వెళుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లాజిస్టిక్ సౌకర్యాలు, పారిశ్రామిక క్లస్టర్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయని, ఫ్రైట్ కారిడార్ హైదరాబాద్ గుండా వెళితే మరింత ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన కార్యక్రమం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’.. ‘అసెంబ్లీ ఇన్‌ ఇండియా’ కార్యక్రమంగా మారిందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ఒక్క చిప్‌ను కూడా తయారు చేయనందున ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఐటీ, ఐటీఈఎస్‌ రంగానికి పెద్దపీట వేయాలన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాలను ప్రోత్సహిస్తే, మొత్తం భారత వృద్ధి రేటుకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. భారతదేశ ఎగుమతి లక్ష్యాన్ని చేరుకోవడంలో గణనీయంగా దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement