Tuesday, March 19, 2024

రైతన్నకు సబ్సిడీ ఊరట.. బడ్జెట్‌లో రూ.1.4లక్షల కోట్లు!

న్యూఢిల్లి: దేశ వ్యాప్తంగా అన్నదాతలు కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉన్నారు. మూడు సాగు చట్టాలను ముక్కు పిండి రద్దు చేయించుకున్నారు. అదేవిధంగా మద్దతు ధర విషయంలోనూ.. కేంద్రంతో అమీతుమీకి సిద్ధంగా ఉన్నారు. సాగు చట్టాల రద్దు.. బీజేపీ పాలనలో అతిపెద్ద ఓటమిగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం రైతుల భారీ నిరసనలు. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న అన్నదాతలను మచ్చిక చేసుకునేందుకు.. ప్రభుత్వం ఉన్న ఆగ్రహాన్ని శాంతింపజేసుకునేందుకు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో భారీ కేటాయింపులు ఉండనున్నట్టు తెలుస్తున్నది. రూ.1.4 లక్షల కోట్లు (18.8 బిలియన్‌ డాలర్లు) ఇచ్చేందుకు నిర్ణయించినట్టు సమాచారం.

చర్చల దశలో సబ్సిడీ అంశం
ఎరువుల పరంగా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా.. ఎరువుల కంపెనీలకు భారీ సబ్సిడీని అందజేసేందుకు కేంద్రం నడుం బిగిస్తున్నది. రైతులకు సబ్సిడీపై ఎరువులు ఇప్పించేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎరువుల కంపెనీలకు 19 బిలియన్‌ డాలర్లను యూనియన్‌ బడ్జెట్‌లో కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎరువుల సబ్సిపై కీలక ప్రకటన చేయనున్నారు. అయితే ఈ విషయంలో ఆర్థిక శాఖ ఇంకా చర్చల దశలోనే ఉన్నట్టు సమాచారం. బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు దీనిపై తుది నిర్ణయం వెల్లడి అవుతుంది. పెరిగిన వ్యయం కీలకమైన స్థానిక ఎన్నికలపై ప్రభావం ఉండొద్దనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది.

ఎన్నికలే లక్ష్యంగా కేటాయింపులు
అదేవిధంగా బడ్జెట్‌ తరువాత.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. అన్నదాతలకు భారీ కేటాయింపులు చేసి.. క్యాష్‌ చేసుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీ నిరసనలు చేపట్టిన వారిని శాంతిపజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఎన్నికల పరంగానూ ఈ అంశం కేంద్రానికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర బడ్జెట్‌కు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోని 60 శాతం మంది జనాభా.. వ్యవసాయంపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. సాగు అనేది వీరి జీవితాల్లో ఎంతో కీలకమైన అంశంగా ఉన్నది. ఎలాగైనా ఐదు రాష్ట్రాల్లో గెలవాలనే లక్ష్యంతో బడ్జెట్‌ కేటాయింపులు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెప్పుకొస్తున్నారు. అయితే రైతులకు ఎరువుల సబ్సిడీ కేటాయింపులపై ఆర్థిక శాఖ ప్రతినిధిని సంప్రదించగా.. సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. ఫిబ్రవరి 2021లో విడుదల చేసిన బడ్జెట్‌లో దాదాపు 800 బిలియన్‌ రూపాయలు.. కేటాయించింది. సాగు చట్టాల నిరసన తరువాత.. దీన్ని ప్రస్తుత బడ్జెట్‌లో మరింత పెంచేందుకు నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement