Thursday, April 25, 2024

స్టడీ మెటీరియలే ఇయ్యలేదు.. చదువుడెట్లా! పరీక్షలు రాసుడెట్లా?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు ఈసారి స్టడీ మెటీరియల్‌ (బేసిక్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌) ఇంకా ఇవ్వనేలేదు. ఇచ్చే అవకాశాలు కూడా కనబడటంలేదు. అటు ఇంటర్‌ బోర్డు అధికారులు ఇటు తెలుగు అకాడమీ అలసత్వం కారణంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో మెటీరియల్‌ను అందుబాటులో ఉంచినప్పటికినీ ప్రింటెడ్‌ మెటీరియల్‌ను మాత్రం ఇవ్వలేదు. గతేడాది కూడా కేవలం ఆప్షనల్‌ సబ్జెక్టులకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. లాంగ్వేజెస్‌ మినహా, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ఇలా ఇతర కోర్సుల ఆప్షనల్‌ సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్‌నే ఇచ్చారు. కానీ ఈ ఏడాది మాత్రం ఇంతవరకు స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేయకపోవడంతో ఇంటర్‌ విద్యా వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మే 6వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు సైతం ప్రారంభం కాబోతున్నాయి.

ఈక్రమంలో ముందస్తుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ ఇస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే పేద విద్యార్థులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రైవేట్‌ పబ్లిషర్స్‌ నుండి బుక్‌స్టాళ్లలో కొనుగోలు చేసుకుంటున్నారు. గతేడాది కూడా పరీక్షలకు కేవలం రెండు వారాల ముందు స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఈ విధంగా జరుగుతోందని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. ముద్రణకు ఆర్డర్‌ ఇవ్వడంలో ఇంటర్‌ బోర్డు జాప్యం, పేపర్‌ సమకూర్చుకోవడంలో తెలుగు అకాడమీ నిర్లక్ష్యం ఇందుకు కారణాలుగా విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రింటెడ్‌ మెటీరియల్‌ ఇవ్వకుండా వెబ్‌సైట్‌లో మెటీరియల్‌ను అందుబాటులో పెట్టారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో చాలా మందికి కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్లు ఉండని పరిస్థితి. కొంత మందికి స్మార్ట్‌ ఫోన్లు ఉన్నా వాటిలో నెట్‌ డేటా ఉండదు. దాంతో కొందరు ఆ మెటీరియల్‌ను ఇంటర్‌నెట్‌ కేంద్రాలకు వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకుంటుంటే, మరికొందరు మాత్రం వేరే మెటీరియల్‌ను కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో ఒక్కో విద్యార్థిపై సుమారు 300 వరకు ఆర్థిక భారం పడుతోంది. 2021-22 విద్యా సంవత్సరంలో తరగతులు ఆలస్యంగా సెప్టెంబర్‌లో ప్రారంభం కావడం, అందులోనూ కొన్ని రోజులు ఆన్‌లైన్‌లో నిర్వహించడంతో సబ్జెక్టులపైన పట్టు సాధించలేని పరిస్థితి. దీనిప్రభావం వార్షిక పరీక్షల ఫలితాలపై పడకుండా ఉండేందుకు 70 శాతం సిలబస్‌ను, ఎక్కువ ఛాయిస్‌లను ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనికితోడూ విద్యార్థులకు పాఠ్యాంశాలు క్లుప్తంగా అర్థమయ్యేలా, అన్ని అంశాలపై ముఖ్యమైన ప్రశ్నలు-జవాబులు పొందుపరిచి స్టడీ మెటీరియల్‌ ఇవ్వాలని భావించారు. ఇవి అందిస్తే వాటిని చదివిన విద్యార్థులు పరీక్షలు సులభంగా రాసి పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారని అనుకున్నారు. కానీ ఇంత వరకు మెటీరియల్‌ ఇంకా పంపిణీ చేయలేదు. దీనిప్రభావం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులపై పడనుంది. గతేడాది ఫలితాల్లోనూ ప్రైవేట్‌ కాలేజీల కంటే ప్రభుత్వ కాలేజీల్లో తక్కువ ఫలితాలు నమోదయ్యాయి. ప్రైవేట్‌ కాలేజీల్లోని విద్యార్థులతో పోటీపడాలంటే విద్యార్థులకు ఇప్పటికైనా స్టడీ మెటీరియల్‌ను అందించాల్సి ఉంటుంది.

విద్యార్థులకు మెటీరియల్‌ ఇవ్వాలి: ఎం.రామకృష్ణ గౌడ్‌, ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి
ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులంతా పేద విద్యార్థులే ఉంటారు. వీరంతా డబ్బులు ఖర్చుపెట్టుకుని మెటీరియల్‌ కొనలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వారందరికీ స్టడీ మెటీరియల్‌ను ఇంటర్‌ బోర్డు అందించాలి. గతేడాది సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు మెటీరియల్‌ అందించారు. కానీ ఈసారి ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికైనా ఇస్తే బాగుంటుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement