Tuesday, April 23, 2024

అప్పర్‌ తుంగకు అనుమతులు ఆపండి.. కేంద్ర జలసంఘానికి తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై చేపట్టిన అప్పర్‌ తుంగ, అప్పర్‌ భద్ర ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర జల సంఘం ప్రాజెక్టు అప్రైజల్‌ డైరెక్టరేట్‌కు తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ బుధవారం లేఖ రాశారు. అప్పర్‌ తుంగ, అప్పర్‌ భద్ర ప్రాజెక్టులకు అనుమతులను ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతర్‌రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్‌ తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వరాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పర్‌ తుంగ, అప్పర్‌ భద్ర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే అంశంపై బచావత్‌ ట్రైబ్యునల్‌ నివేదించిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు.

బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ నీటి కేటాయింపులు చేసినప్పటికీ సుప్రీంకోర్టులో పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత తక్కువగా ఉందని రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే కృష్ణాకు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీటి ప్రవాహం భారీగా తగ్గుతుందని దీంతో తెలంగాణకు తీరని నష్టం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. కృష్ణా నదికి నీటి ప్రవాహం తగ్గితే తెలంగాణ ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అప్పర్‌ తుంగ, అప్పర్‌ భద్ర ప్రాజెక్టులకు అనుమతులను మంజూరు చేసే సమయంలో దిగువ రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కోరారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ రెండు ప్రాజెక్టులకు ప్రాజెక్టు అప్రైజల్‌ కమిటీ ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆయన కేంద్ర జల సంఘానికి విజ్ఞప్తి చేశారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు అమల్లోకి వచ్చే వరకు వాటిని నిలుపుదల చేయాలని లేఖలో కోరారు. ఈ రెండు ప్రాజెక్టులకు బచావత్‌ ట్రైబ్యునల్‌ కూడా ఎటువంటి కేటాయింపులు చేయలేదని ఆయన లేఖలో ప్రస్తావించారు. ట్రైబ్యునల్‌ కేటాయింపులు ఉన్నప్పటికీ ఇందుకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. దిగువ రాష్ట్రాల అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement