Saturday, April 20, 2024

నిరుద్యోగులకు శుభవార్త.. 5వేల పోస్టుల భర్తీకి SBI నోటిఫికేషన్

దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. నేటి నుంచి మే 17 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 5 వేల ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో కర్క్‌ పోస్టులతో పాటు క్లరికల్‌ క్యాడర్‌లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులకు స్థానిక భాష తెలిసి ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష జూన్‌లో, మెయిన్స్ పరీక్ష జూలై 31న నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు https://www.sbi.co.in/careers వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉన్న అభ్యర్థులు 20-28 ఏళ్ల మధ్య వయస్సు లేదా 1993, ఏప్రిల్‌ 2 నుంచి 2021, ఏప్రిల్‌ 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ రాతపరీక్ష. పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్‌ అని రెండు విభాగాలుగా ఉంటుంది.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ.. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు అన్ని ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. నిర్ణీత సమయంలోపు సెక్షన్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 30 మార్కులకు ఉంటుంది. న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 70 మార్కులు ఉంటాయి. మూడు విభాగాలకు 20 నిమిషాల చొప్పున మొత్తం గంట సమయంలో పరీక్ష రాయాలి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్ష రాయవచ్చు. ఇందులో మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. వాటికి 200 మార్కులు కేటాయించారు. పరీక్షను 2.40 గంటల సమయంలో పూర్తిచేయాలి. జనరల్‌ లేదా ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ (50 మార్కులు, 50 ప్రశ్నలు), జనరల్‌ ఇంగ్లిష్‌ (40 మార్కులు, 40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (50 మార్కులు, 50 ప్రశ్నలు), రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ (50 ప్రశ్నలు, 60 మార్కులు) నుంచి ప్రశ్నలు అడుగుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement