Thursday, April 25, 2024

Sri Lanka crisis: శ్రీలంకలో సోషల్‌ మీడియాపై నిషేధం

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజల ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. దీంతో ఇప్పటికే దేశంలో అత్యవసర పరిస్థితి అమలు చేస్తున్నారు.  వీటిని నియంత్రించేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదేశాలు జారీచేసింది. దీంతో దేశంలో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, యూట్యూబ్‌ సేవలు నిలిచిపోయాయి. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

శ్రీలంక కొద్ది రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నిత్యావసర వస్తువులు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. దీంతో ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దేశంలో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో అధ్యక్ష భవనం ఎదుట గురువారం రాత్రి ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు.  ప్రజల భద్రత, అత్యవసర సేవల కోసం, నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకొన్నట్టు రాజపక్స పేర్కొన్నారు. ఎమర్జెన్సీ శుక్రవారం(ఏప్రిల్ 1) నుంచే అమల్లోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement