Friday, March 29, 2024

శ్రీ‌లంక ఆలౌట్.. టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

బెంగళూరు టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణించింది. కఠినమైన పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసిన భారత్.. శ్రీ‌లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి పంత్, శ్రేయాస్ అర్ధశతకాలతో రాణించడంతో టీమిండియా 303/9 వద్ద డిక్లేర్ చేసింది. 447 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంకను రెండో రోజు చివరి సెషన్‌లోనే బుమ్రా దెబ్బతీశాడు. లాహిరు తిరుమానే (0)ను డకౌట్ చేశాడు. అయితే ఆ తర్వాత వికెట్ పడకుండా కాపాడుకున్న కెప్టెన్ కరుణరత్నే (107), కుశాల్ మెండిస్ (54) లంకను ఆదుకున్నారు. అయితే రెండో రోజు ఆటమొదలైన తర్వాత అశ్విన్, జడేజా తిప్పేయడం మొదలు పెట్టారు. మెండిస్‌, డిసిల్వ(4)ను అశ్విన్ పెవిలియన్ చేర్చగా.. ఏంజెలో మాథ్యూస్ (1)ను జడ్డూ వెనక్కుపంపాడు. ఆ తర్వాత డిక్కవెల్ల (12), ఆసలంక (5), లసిత్ ఎంబుల్డెనియా (2)తో కలిసి కరుణరత్నే జట్టును ముందుకు నడిపించేందుకు ప్రయత్నించాడు. కానీ అతనికి లంక బ్యాటర్ల నుంచి ఎటువంటి సహకారం లభించలేదు. చివరకు బుమ్రా బౌలింగ్‌లో కరుణరత్నే బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత అశ్విన్ వచ్చి ఎంబుల్డెనియాను ఎల్బీగా వెనక్కు పంపాడు. లక్మల్ (1)ను కూడా బుమ్రా అవుట్ చేశాడు. కాసేపటికే విశ్వ ఫెర్నాండో (2) కూడా అశ్విన్ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. 447 పరుగుల టార్గెట్‌లో సగం పరుగులు కూడా చేయలేకపోయిన లంక 208 పరుగులకు చాపచుట్టేసింది. భారత బౌలర్లలో బుమ్రా 3, అశ్విన్ 4, అక్షర్ 2, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు. వీళ్లంతా కలిసి రెండో టెస్టులో భారత్‌కు 238 పరుగుల తేడాతో విజయాన్ని అందించారు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారతజట్టు 2-0తో కైవసం చేసుకుంది. రోహిత్ కెప్టెన్ అయిన తర్వాత సిరీసులన్నీ వరుసగా క్లీన్ స్వీప్ చేస్తున్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement