Thursday, April 25, 2024

Spl Story – తెలంగాణ ఖజానాకు భూమ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అతిత్వరలో భారీ ఎత్తున భూ వేలానికి రంగం సిద్ధమైంది. రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని భూముల వేలానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భూముల విక్రయాలతో మరోసారి భారీ రాబడికి ప్రభు త్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో ప్లాట్లకు భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో ఇక వరుసగా జిల్లాల్లో వెంచర్లను అభివృద్ధి చేసి రూ.వేల కోట్ల లక్ష్యం దిశగా రంగంలోకి దిగింది. గతేడాది కోల్పో యిన పన్నేతర ఆదాయం లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్న ప్రభుత్వం ఇందుకు వీలుగా ఉన్న భూముల వివరాలను సేకరించి నివేదిక రెడీ చేసింది. ఈ దఫా ఎటువంటి న్యాయ వివా దాలు లేకుండా ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు భూములతో భారీగా వెంచర్లు వేసేలా కీలక ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. తద్వారా రూ.20 వేల కోట్ల లక్ష్యం చేరేందుకు కార్యాచరణ ముమ్మరం చేసింది. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రం లోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విక్రయాలకు చర్యలు తీసుకు న్నది. హెచ్‌ఎండీఏ పరిధిలోని మూడు జిల్లాల పరిధిలోని స్థలాల విక్రయం తో రూ.6500 కోట్లు ఆర్జించే లక్ష్యంతో ఈ వేలం నిర్వహిస్తోంది.

ఒకవైపు భూముల విక్రయంతోపాటుగానే మరోవైపు గతంలో నిల్చిపోయిన లే అవుట్ల క్రమబద్దీకరణ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 633 వెంచర్లను గుర్తించారు. వీటితో మరో రూ.500 కోట్లు రానుందని అంచనా వేస్తున్నారు. లే అవుట్లలో ఇప్పటివరకు విక్రయిం చకుండా మిగిలిపోయిన ప్లాట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత నివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసుకొని ఉంటే అలాంటి వారికి తాజా ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీటికి భవన నిర్మాణ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలతోపాటు 33శాతం కాంపౌండ్‌ ఫీజులు చెల్లించాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది. లే అవుట్ల క్రమబద్దీకరణతో పోల్చితో ఇవి మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటివరకు గుర్తించిన లే అవుట్లలో 1.31 లక్షల ప్లాట్లలో ఇంకా 40వేల ప్లాట్లు విక్రయించకుండా మిగిలిపోయాయి.

సొంతంగా లే అవుట్లు…
మరోవైపు ఇలా క్రమబద్దీకరణలతో ఆదాయార్జనకు వీలుండగానే ప్రభుత్వ భూముల విక్రయాలతో మరింత ఆదాయానికి ప్రభుత్వం స్కెచ్‌ వేసింది. ప్రభుత్వ భూములతోపాటు, ప్రైవేట్‌ భూములను సేకరించి వెంచర్లుగా అభివృద్ధిపర్చి విక్రయించాలని యోచిస్తోంది. ఈ ఏడాది పన్నేతర ఆదాయాల్లో భాగంగా భూముల అమ్మకాలతో రూ.25,421 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు రూ.8,400 కోట్ల రాబడే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, పక్కనే ఉన్న ప్రైవేటు భూములను గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 5 వేల ఎకరాలను ఇందుకు వీలుగా గుర్తించారు. ఇందులో డెవలప్‌మెంట్‌ కింద 2500ఎకరాలతో రూ.10 వేల కోట్లు పొందేలా ప్లాన్‌ వేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 1000ఎకరాల అసైన్డ్‌ భూములపై కూడా సర్కార్‌ దృష్టి సారించింది. వీటితో మరో రూ.5 వేల కోట్లు అంచనా వేస్తోంది. ఇలా మొత్తంగా రాష్ట్రంలో అమ్మకానికి వీలుగా ఉన్న 13వేల ఎకరాల భూములను ప్రభుత్వం గుర్తించింది. మిగులు, ప్రభుత్వ అసైన్డ్‌ భూములతో పక్కా విధానంతో భారీగా రాబడి సమకూర్చుకోవాలనే ప్రతిపాదన సిద్ధమవుతోంది.

రానున్న రోజుల్లో సుమారు రూ.50 వేల కోట్లకు పైగా వేలంతో ఆదాయం సమకూర్చుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇందుకు ఏమేరకు సుముఖంగా ఉందో ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ, అసైన్డ్‌, దేవాదాయ, ఫారెస్టు భూములపై ప్రభుత్వం ఆశలు పెట్టుకుంటూ వస్తోంది. అయితే అసైన్డ్‌ భూములపై ప్రత్యేక విధానం రూపొందించాల్సి ఉంది. నూతన రెవెన్యూ చట్టంతో దీనిపై స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న హెచ్‌ఎండీఏ పరిధిలోని విలువైన భూములను ప్రత్యేకంగా తెప్పించుకుని రెవెన్యూ శాఖ అంచనాలు రూపొందించింది. వీటి అమ్మకాలతో దశలవారీగా రూ.50 వేల కోట్లు సమీకరించుకునే అవకాశాలను రెవెన్యూ శాఖ రూపొందించింది. అయితే పేదల అసైన్డ్‌ భూముల తిరిగి స్వాధీనం అంశం సున్నితమైంది కావడంతోపాటు, న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా రాబడి లోటును పూడ్చుకునేలా ప్రణాళికాబద్దంగా వేలంతో భూములను విక్రయించి రాబడిని పెంపొందించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు హెచ్‌ఎండీఏ, హైదరాబాద్‌ జిల్లాలోపాటు, అన్ని జిల్లాల్లోనూ విక్రయానికి సిద్దంగా ఉన్న భూముల వివరాలతో జాబితాను సిద్ధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement