Thursday, March 28, 2024

Spl Story : వెండితెర య‌మ‌ధర్మరాజు క‌న్నుమూత‌..

సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ క‌న్నుమూశారు. ఫిలిం న‌గ‌ర్లోని త‌న నివాసంలో ఆయ‌న తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా క‌వుత‌వ‌రంలో 1935 జూలై 25న ఆయ‌న జ‌న్మించారు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. 1954లో సిపాయి కూతురు సినిమాతో చ‌ల‌న చిత్ర రంగ ప్ర‌వేశం చేశారు. మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి చివ‌రి చిత్రం. 1994లో బంగారు కుటుంబం చిత్రాన్ని నిర్మించారు. 777 చిత్రాల‌లో న‌టించారు. ఎస్వీ రంగారావు త‌ర‌వాత పురాణ పాత్ర‌ల‌లో ఆయ‌న మెప్పించారు. రాక్ష‌స పాత్ర‌ల‌లో జీవించారు. య‌ముడిగా ఆయ‌న న‌ట‌న అపూర్వం. కొన్నాళ్ళుగా ఆయ‌న తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. న‌వ‌ర‌స న‌ట‌నా సార్వ‌భౌమునిగా ఖ్యాతి గ‌డించారు. విల‌న్ వేషాల‌లో దిట్ట‌. విల‌న్‌గా ఆయ‌న న‌టన ప్రేక్ష‌కుల‌లో కోపాన్ని తెప్పించేది. ఒక న‌టుడిగా గుర్తింపు పొందార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. శ‌నివారం హైద‌రాబాద్‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు..ఆయ‌న వ‌య‌సు 87సంవ‌త్స‌రాలు. కాగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఫిలింనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. హీరోగా, విలన్‌గా, కమేడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి నవరస నట సార్వభౌముడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సూపర్‌ హిట్‌ సినిమాలను రూపొందించారు.

చదువు పూర్తయ్యాకే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్న కైకాల.. విజయవాడలో ఇంటర్మీడియెట్‌, గుడివాడలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసు రైలు ఎక్కేశారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిర్మాత డీ.ఎల్‌ నారాయణ ఆయనలోని నటుడిని గుర్తించారు. అలా ‘సిపాయి కూతురు’ సినిమాలో నారాయణ అవకాశం ఇచ్చారు. చంగయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఫ్లాప్‌గా మిగిలింది. అయితే నటుడిగా కైకాలకు మంచి గుర్తింపు వచ్చింది. కైకాల తన రెండవ సినిమా ‘కనక దుర్గ పూజా మహిమ’తో విలన్‌గా అవతారమెత్తారు. ఈ సినిమా ఆయన జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమాలో కైకాల పండించిన విలనిజం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దాంతో కైకాలకు ప్రతినాయకుడిగా వరుస అవకాశాలు వచ్చాయి.

- Advertisement -

అంతేకాకుండా కైకాల రూపం సీనియర్‌ ఎన్‌టీఆర్‌ను పోలి ఉండటంతో ఆయనకు డూప్‌ దొరికినట్లు అయింది. అలా రెండో సినిమా చేస్తున్నప్పుడే కైకాల.. సీనియర్‌ ఎన్టీఆర్‌ కంట పడ్డారు. దాంతో ఎన్‌టీఆర్‌ తను నటిస్తున్న ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’లో కైకాలకు ఒక పాత్రనిచ్చారు. ఆయన నటనకు ముగ్దుడైన సీనియర్‌ ఎన్టీఆర్‌.. తన డూప్‌గా నటించిన ప్రతీ సినిమాలో కైకాలనే పెట్టుకున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి కైకాలా 101 చిత్రాల్లో నటించారు. కేవలం విలన్‌ పాత్రలే కాకుండా సహాయ నటుడిగా ఎన్నో విలక్షణ మైన పాత్రలు వేశాడు. యముడిగా, కర్ణుడిగా, రావణుడిగా, దుర్యోధనుడిగా, ఘటోత్కచుడుగా ఎన్నో పాత్రలు పోషించి ఆ పాత్రలకే వన్నే తీసుకొచ్చారు. ముఖ్యంగా రావణుడు అంటేనే కైకాల అనేంతలా తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేశారు. తన 60 ఏళ్ళ సినీ కెరీర్‌లో కైకాల దాదాపు 777 సినిమాల్లో నటించారు. ఇక దాదాపు 200మంది కొత్త దర్శకులతో పనిచేసిన ఆయన ఐదు తరాల హీరోలతో వెండితెరను పంచుకున్నారు.

అంతేకాకుండా ఆయన నటించిన 223 చిత్రాలు 100 రోజులు, 59 సినిమాలు 50రోజులు ఆడాయి. ఎస్వీ రంగారావు తర్వాత ఆ స్థాయి నటుడిగా కైకాల పేరు సంపాదించుకున్నారు. నటుడిగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కైకాల సత్యనారాయణ.. రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ‘ఇద్దరు దొంగలు’, ‘కొదమ సింహం’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దుల మొగుడు’ వంటి సినిమాలు నిర్మించారు. చివరగా ఆయన మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షీ’ సినిమాలో కనిపించాడు. నటనను కొనసాగిస్తూనే 1996లో రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement