Friday, October 4, 2024

Specical Story – సింగరేణి కార్మిక సంఘాల్లో నాయకత్వ సంక్షోభం!

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, మంచిర్యాల : సింగ‌రేణి అతి పెద్ద ప్ర‌భుత్వ రంగ సంస్థ‌… సుమారు 40 వేల‌కు పైగా కార్మికులు బొగ్గు గ‌నుల్లో ప‌నిచేస్తూ ఉంటారు. నిరంతం ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యే కార్మికులకు, యాజ‌మాన్యం మ‌ధ్య వారాధిగా సంఘాలు ప‌నిచేస్తుంటాయి. అలాంటి సంఘాల‌కు ప‌దేళ్ల కింద‌ట ఉద్యోగ విర‌మ‌ణ చేసిన కార్మికులే నాయ‌కత్వం బాధ్య‌త వ‌హిస్తున్నారు. ప్ర‌తి రెండేళ్ల‌కు జ‌రిగే ఎన్నిక‌ల్లో గుర్తింపు సంఘాన్ని కార్మికులు ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక‌ల ద్వారా ప్రాధాన్యత సంఘం కూడా నిర్ణ‌యించ‌బ‌డుతుంది.

ప్ర‌స్తుతం గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ, ప్రాతినిధ్యం సంఘంగా ఐఎన్‌టీయూసీ ఉంది. అయితే ముప్ప‌యి ఏళ్లుగా ద్వితీయ శ్రేణి నాయ‌కులను ఎద‌గ‌నివ్వ‌క‌పోవ‌డంతో కొత్త నాయ‌క‌త్వం కొర‌వ‌డింది. దీంతో రిటైర్డు అయిన కార్మికులే సంఘాల‌కు నాయ‌క‌త్వం బాధ్య‌త వ‌హిస్తున్నారు. రాష్ట్ర రాజ‌ధానిలో ఉంటూ ఇక్క‌డ‌ సంఘాలు న‌డిపించ‌డంతో కార్మికులకు స‌రైన న్యాయం జ‌ర‌గ‌డం లేద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. దాదాపు అన్ని సంఘాలు రాజ‌కీయ‌పార్టీ నీడ‌లోనే మ‌నుగ‌డ సాగిస్తుంటాయి. ఆ పార్టీల రాజ‌కీయ అవ‌స‌రాల‌కు సంఘాల‌ను ఉప‌యోగించుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనివ‌ల్ల సింగ‌రేణిలో రాజ‌కీయ జోక్యం రానురాను పెరిగిపోతోంద‌న్న విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఇప్ప‌టికైనా సింగ‌రేణిలో ప‌నిచేసే కార్మికుల‌ను నేత‌లుగా త‌యారు చేయ‌డంలో కీల‌క‌పాత్ర వ‌హించాల‌ని ప‌లువురు కార్మికులు కోరుతున్నారు.

ఎద‌గ‌ని ద్వితీయ శ్రేణి నేత‌లు
సింగరేణిలో ప‌ద‌కొండు గ‌నులు ఉన్నాయి. సింగ‌రేణి మొత్తానికి ఒక గుర్తింపు సంఘం, అలాగే ప్రాధాన్యం సంఘం ఉంటాయి. ప్ర‌స్తుతం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అనుబంధం కార్మిక సంఘం. ఏరియాను బ‌ట్టీ ప్రాధాన్య‌త సంఘం మారుతుంది. ఏరియా వారీగా ఉన్న సంఘాల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న నేత‌లు ఎద‌గ‌క‌పోవ‌డంతో సింగ‌రేణి కార్మిక సంఘానికి నాయ‌కులు కొర‌త వెంటాడుతోంది. దీంతో కార్మిక సంఘాల్లో నాయ‌క‌త్వం సంక్షోభం త‌లెత్తుతోంది. ప‌దేళ్ల కింద రిటైర్డు అయ్యే వారే ఇప్ప‌టికీ సంఘ నేత‌లుగా చ‌లామ‌ణి అవుతున్నారు.

- Advertisement -

సింగ‌రేణిలో ప‌ద కొండు గ‌నుల్లో ఉన్న సంఘ నేత‌లు వీరి అడుగు జాడ‌ల్లోనే న‌డుచుకోవాల్సి ఉంటుంది. సింగ‌రేణి బొగ్గు గ‌నుల్లో కార్మికుల స‌మ‌స్య‌లు, అలాగే నూత‌న చ‌ట్టాలు, స‌మ‌కాలిన‌ సామాజిక ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న ఉన్ననాయ‌కులు కొర‌వ‌డ‌డంతో రిటైర్డు కార్మికులు నాయ‌క‌త్వంలో సంఘాలు కొన‌సాగుతున్నాయి. గ‌త ముప్ప‌యి ఏళ్లుగా ఉన్న నాయ‌కులే ఇంకా సంఘాల‌కు బాధ్యులుగా ఉంటున్నారు. వ‌య‌స్సు రీత్యా వారు గ‌నుల్లోకి వెళ్లి స‌మ‌స్య‌లు తెలుసుకోలేక‌పోతున్నారు. అలాగే ఏ కార్మికుడికి స‌మ‌స్య వ‌చ్చినా, గ‌నుల్లో ప్ర‌మాదాలు జ‌రిగినా క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించే ప‌రిస్థితి లేక‌పోతోంది. దీంతో యాజ‌మాన్యం నిర్ల‌క్ష్య‌మా? ప్ర‌మాదామా? అనేది నిర్ధారించి ప‌రిస్థితులు కాన‌రావ‌డం లేద‌ని కార్మికులు అంటున్నారు. కాలానుగుణంగా స‌మ‌స్య‌లు కూడా మారుతుంటాయి. అలాగే జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో స‌మ‌కాలిన స‌మ‌స్య‌లు, ప‌రిస్థితులు, అలాగే బొగ్గుకు ఉండే ధ‌ర‌లు, డిమాండ్ తెలుసుకునేలా నాయ‌క‌త్వం అప్‌డేట్ కావాల్సి ఉంటోంది.

క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న క‌రువు
సింగరేణి సంస్థలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్‌, హెచ్ఎంఎస్, సీఐటీయూ సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నాయ‌కులు వయసు మీరిన నేపథ్యంలో చురుగ్గా కార్యకలాపాలు సాగించలేకపోతున్నారు. హైదరాబాద్ నుండి కార్యకలాపాలు సాగిస్తున్నారు. తప్ప క్షేత్రస్థాయిలో పర్యటించడం లేద‌ని కార్మికుల్లో ఒక చ‌ర్చ ఉంది. క్షేత్ర స్థాయిలో త‌ర‌చూ వెళ్ల‌క‌పోతే కార్మికుల సాధ‌క‌బాధ‌క‌లు తెలియ‌ని ప‌రిస్థితి. అలాంట‌ప్పుడు కార్మికుల‌కు న్యాయం జ‌రిగే ప‌రిస్థితి ఉండ‌ద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఐఎన్‌టీయూసీలో మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు స్థానంలో జ‌న‌క్ ప్ర‌సాద్ నాయకత్వం వ‌హిస్తున్నారు. ప్రస్తుతం కనీస వేతనాల అడ్వైజరీ కమిటీ చైర్మన్ కూడా ఐఎన్ టీయూసీ నాయ‌కుడు జనక్ ప్రసాద్ వహిస్తున్నారు. గుర్తింపు పొందిన సంఘ‌మైన‌ ఏఐటీయూసీ నుండి వాసిరెడ్డి సీతారామయ్య నాయకత్వం వహిస్తున్నారు. హెచ్ఎంఎస్ నుండి రియాజ్ అహ్మద్, బీఎంఎస్ నుండి గతంలో పులి రాజారెడ్డి ప్రస్తుతం యాదగిరి సత్తయ్య, సీఐటీయూ నుండి తుమ్మల రాజిరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. వీరిలో చాలా మంది ఉద్యోగ విరమణ పొందిన కార్మికులే. దీనివ‌ల్ల ఇటు కార్మికుల సాధ‌క‌బాధ‌క‌లు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌డం సాధ్య‌ప‌డ‌దు.

క‌ర‌ప‌త్రాల పంపిణీకి ప‌రిమిత‌మైన ఏరియా నాయ‌కులు
క‌ర‌ప‌త్రాల పంపిణీకి, స‌మాచారం ఇవ్వ‌డానికి మాత్ర‌మే ఏరియా సంఘ నాయ‌కులు ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయినా ఏ సంఘం కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ద్వితీయ శ్రేణి నాయ‌కులు ఎదిగేలా త‌యారు చేయ‌డంలో సంఘ నేత‌లు, ఆయా అనుబంధం రాజ‌కీయ పార్టీలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. దశాబ్దాలుగా సింగరేణిలో నాయకత్వం వహించిన కార్మిక సంఘాల నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగకుండా, గుర్తింపు రాకుండా అణ‌గదొక్కేవారని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం కార్మికుల్లో కూడా చ‌దువుకున్న వారి సంఖ్య కూడా పెరిగింది. త‌మ‌కు అప్ప‌గించిన బాధ్య‌త నెర‌వేర్చ‌గ‌ల స‌మ‌ర్థ‌త ఉన్న నాయ‌కులు కూడా లేక‌పోలేదు. కానీ అలాంటి వారిని సంఘ నేత‌లుగా ఎందుకు త‌యారు చేయ‌డం లేదో అంతుప‌ట్ట‌డం లేద‌ని ప‌లువురు కార్మికులు ప్ర‌శ్నిస్తున్నారు.

రాజ‌కీయ‌పార్టీ నీడ‌లో…
ప్ర‌ధానంగా కార్మిక సంఘాల‌న్నీ ఒక రాజ‌కీయ‌పార్టీ నీడ‌లో న‌డుస్తున్నాయి. ఆయా పార్టీ నాయ‌క‌త్వం సూచ‌న‌ల మేర‌కు సంఘ నేత‌లు కూడా ప‌య‌నిస్తున్నారు. ప్ర‌స్తుతం గుర్తింపు పొందిన సంఘం ఏఐటీయూసీ సీపీఐకి అనుబంధ కార్మిక సంఘం. అలాగే ప్రాధాన్య‌త సంఘంగా ఉన్న ఐఎన్‌టీయూసీ కాంగ్రెస్‌కు అనుబంధ సంఘం. సీఐటీయూ సీపీఎం అనుబంధ కార్మిక సంఘం. ఇక్క‌డ ఉన్న సంఘ నేత‌లంద‌రూ ఆయా పార్టీల‌తో అనుబంధం ఉన్న‌వారు. దీంతో రాజ‌కీయ‌పార్టీ నీడ‌లోనే కార్మిక సంఘాలు న‌డుస్తున్నాయ‌ని, దీనివ‌ల్ల సంఘ నేత‌లు కార్మికుల కంటే, రాజ‌కీయ పార్టీ నేత‌ల మ‌న్న‌న‌లు పొంద‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

యాజ‌మాన్యం చెప్పిందే వేదం…
సంఘ నాయ‌కుల‌కు కార్మిక స‌మ‌స్య‌లు, కార్మిక చట్టాలు, గని చట్టాలపై అవగాహన లేకపోతే యాజమాన్యం చెప్పిందే వేదంగా మారే పరిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. అదే ప‌రిస్థితి సింగ‌రేణిలో జ‌రుగుతుంద‌ని కార్మికులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రిటైర్డు ఉద్యోగుల‌కు ఇప్పుడు కార్మికుల ప‌డుతున్న క‌ష్టాలు, పెరుగుతున్న‌ పని భారం గురించి తెలియ‌డం లేద‌ని, సింగ‌రేణికి ఎంత లాభాలు వ‌చ్చాయో తెలియ‌క‌పోవ‌డంతో యాజ‌మాన్యం ప్ర‌క‌టించిన లెక్క‌ల‌కు త‌ల‌వూప‌డం… దీంతో కార్మికుల‌కు ప్ర‌క‌టించిన‌ బోన‌స్ విష‌యంలోనూ అన్యాయం జ‌రుగుతుంద‌ని కార్మికులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement