Tuesday, December 3, 2024

Special Story – దేవాల‌యాల విశిష్ట‌త కాపాడుకుందాం..

ఆల‌యాల పర్యవేక్షణకు.. టాస్క్ ఫోర్స్!
ప్ర‌త్యేక‌ కమిషన్ అయినా కావాలి
ఈ రెండింటిలో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి
దానికి క‌చ్చిత‌మైన చట్టభద్ద‌త‌ కల్పించాలి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌ భక్తుల నుంచి వినిపిస్తున్న‌ డిమాండ్
తిరుమల లడ్డూ వ్యవహారంతో తెర‌పైకి టాస్క్ ఫోర్స్ అంశం
ఆలయాల నిర్వహణలో అడుగడుగునా లోపాలు
కేవలం ప్రసాదం మాత్రమే కాదు, శతకోటి సమస్యలకు నిలయంగా టెంపుల్స్‌
ప్రముఖ దేవాలయాల్లో పెద్ద ఎత్తున‌ అవినీతి కంపు
ఎండోమెంట్ పేరుతో హిందూ దేవాలయాలను చేతుల్లోకి తీసుకుంటున్న ప్రభుత్వాలు
పర్యవేక్షణను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు
చర్చిలు, మసీదులు, సాయిబాబా ఆలయాల్లో కనిపించని సమస్యలు
ఎండోమెంట్ పరిధిలో ఉన్న టెంపుల్స్‌లోనే వెలుగులోకి
పూజారుల కంటే బ్రోకర్ల హడావిడీ ఎక్కువ
అధికారులు, పాలక మండళ్లకు సొంత ప్రయోజనాలే ముఖ్యం
పుట్టపర్తి బాబా ఆలయంలో ప్ర‌శాంత‌ వాతావరణం..
ఇత‌ర ఆల‌యాల్లో ఎందుకు అలా ఉండ‌డం లేదు
దేవాలయాల్లో ధర్మం విరుద్ధ చర్యలను కూకటివేళ్లతో పెకిలించాలి
ఇరు రాష్ట్రాల సీఎంలు ఆ దిశగా ఆలోచన చేయాలి
ప్రజలు, ఆధ్యాత్మిక వాదుల‌నుంచి పెరుగుతున్న డిమాండ్

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో:

హిందువులు పరమ పవిత్రంగా భావించే దేవాలయాల్లో అడుగడుగునా అపవిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సనాతన ధర్మాన్ని కొంతమంది స్వార్థపరులు అధర్మం వైపు నడిపిస్తున్నారు. దేవుడి పేరు చెప్పుకుని దోచుకునే వారు కొందరైతే.. ప్రసాదాల ముసుగులో సొంత ఖజానా నింపుకునేవారు మరికొందరున్నారు. ఇలా రోజు రోజుకు హిందూ దేవాలయాల్లో అవినీతి అక్రమాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత పవిత్రమైన దేవాలయాలను కొంతమంది ఆర్థిక అవసరాలకు వేదికగా మార్చేసుకుంటున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఎటు చూసినా ఈ తరహా సంఘటనలే కనిపిస్తున్నాయి. ఆచారాలను కట్టుబాట్లను పవిత్రంగా భావించే పూజారుల కంటె బ్రోకర్ల హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా పలు ఆల‌యాలు అవినీతి కంపుతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి లడ్డూ వ్యవహారంతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్, ప్రత్యేక కమిషన్లలో ఏదో ఒకటైనా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇటు ఏపీలో, అటు తెలంగాణాలో భక్తుల నుంచి ఇదే మాట వినిపిస్తోంది.

- Advertisement -

మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళా కమిషన్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయడం ద్వారా దేవుళ్ల పేరుతో దోపిడీ చేస్తున్న స్వార్థపరుల ఆటకట్టించొచ్చు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అదే విధంగా దేవాలయాల్లో అవినీతిని తరిమికొట్టేందుకు సర్వరోగ నివారిణిగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే పలు ఆలయాల్లో నిర్వవాణా లోపం ఉన్నట్లు సంబంధిత అధికారులు పలు సందర్భాల్లో గుర్తించారు. ఆ దిశగా జరిపిన విచారణలో కూడా ఆక్రమాలు వాస్తవాలేనని నిర్ధారణకు వ‌చ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో చోటు చేసుకుంటున్న అనేక స్కాములు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కేవలం ప్రసాదాల తయారీలో మాత్రమే కాదు.. ఇతర అంశాల్లో కూడా అనేక సమస్యలు దేవాలయాలను చుట్టుముడుతున్నాయి.

స‌మ‌స్య‌ల పరిష్కారం పేరుతో ఆలయ కార్యనిర్వాహణాధికారులు, పాలక మండళ్లు అందిన కాడికి బొక్కేసే ప‌నిలో ఉంటున్నాయి కానీ, అస‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేదు. దీంతో ఆలయాల అభివృద్ధికి కానుకల రూపంలో సమర్పిస్తున్న కోట్లాది రూపాయల సొమ్ము హారతి కర్పూరంలా కరిగిపోతోంది. అందుకు లెక్కా పక్కా కూడా సరిగా ఉండటం లేదు. ఆడిట్లో కూడా అనేక సందర్భాల్లో లెక్కల్లో తేడాలు బయటపడ్డాయి. అయినా అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవడం కానీ, రికవరీ చేసిన సందర్భాలు కానీ కనిపించడంలేదు. అందుకే దేవాలయాల పరిరక్షణకు ఆలయాల సొమ్ము భద్రతకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరమీదకు వస్తుంది. ఆ దిశగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ అడుగులు వేయాలని భక్తులు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడానికి కమిషన్ తరహాలో చట్టభద్ధ‌త‌ కలిగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం అన్న అభిప్రాయం కూడా అంద‌రిలో వ్యక్తమవుతుంది.

చర్చిలు, మసీదులు, సాయిబాబా ఆల‌యాల్లో కనిపించని సమస్యలు

రాష్ట్రంలోని చర్చిలు, మసీదులు, సాయిబాబా ఆలయాల్లో నిత్యం ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. సమస్యలు కూడా పెద్ద‌గా కనిపించవు. భక్తులకు ఇబ్బందికరమైన సమస్యలు తలెత్తకముందే నిర్వాహకులు వాటిని ముందే గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంటారు. ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని ప్రముఖ చర్చిలు, మసీదులు, సాయిబాబా మందిరాల్లో అవినీతికి దూరంగా భక్తులు ప్రశాంత వాతావరణంలో భక్తి కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. ఆ తరహా వాతావరణం చూద్దామన్న హిందూ దేవాలయాల్లో కనిపించడంలేదు. పుట్టపర్తి సాయిబాబా ఆలయం నడిచినంత ప్రశాంతంగా దేవాదాయ శాఖ పరిధిలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఎందుకు వాతావరణం కనిపించడంలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

కావాల్సిన సంప‌ద ఉన్నా.. క‌నీస సౌక‌ర్యాలు లేవు..

ప‌లు ఆల‌యాల‌కు కావాల్సినంత సంప‌ద ఉన్నా.. నిత్యం సమస్యలతోనే దైవ దర్శనాలను పూర్తి చేసుకోవాల్సి వస్తుందని భక్తులు నిలదీస్తున్నారు. ఆయా దేవుళ్లకు కోట్లాది రూపాయల ఆస్తులున్నా దేవాలయాలకు నిత్యం లక్షల్లో ఆదాయం వస్తున్నా భక్తులకు కనీస సౌకర్యాలను కూడా కల్పించలేక ఎండోమెంట్ అధికారులు, పాలకమండళ్లు, ఫెస్ట్సిపల్ కమిటీలు చేతులెత్తేస్తున్నాయి. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పూజలు, ప్రపాదాలు, టికెట్ల అమ్మకాలతో దేవాలయాలకు వస్తున్న ఆదాయం ఎవరి ఖాతాకు వెళ్తున్నాయో తెలియదు కాని కొన్ని దేవాలయాలలో సిబ్బందికి సకాలంలో జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మౌనం వహిస్తుండడంపై పలు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంత మంది అధికారుల తీరుపై నిత్యం ఫిర్యాదులు అందుతున్న రాష్ట్ర స్థాయి అధికారులు వి. చారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. అవినీతి అధికారుల నుంచి పెద్ద ఎత్తున మామూలు తీసుకుంటూ పరోక్షంగా వారిని సమర్ధిస్తున్నారు. దీంతో అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా దేవాదాయ శాఖ ఆలయాలు మారిపోతున్నాయి.

బ్రోకర్ల హడావిడి ఎక్కువ..

కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కొంతమంది సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ప్రముఖ దేవాలయాలలో సుదీర్ఘకాలం తీప వేసి కూర్చున్న ద్వితీయ స్థాయి అధికారులు కొంతమంది బ్రోకర్లను ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా తరతరాలుగా ఆలయాలనే నమ్ముకుని ఆచారాన్ని పవిత్రంగా భావించే పూజారులు అడుగడుగునా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వేద మంత్రాలతో దేవుళ్లకు మేలుకొలుపు కార్యక్రమాలు, పల్లకి సేవలు, హారతి పూజలు వంటి కార్యక్రమాలతో నిత్యం దైవ సన్నిధిలోనే సేవలు చేసే పూజారుల కంటే బ్రోకర్ల హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది. మరికొంతమంది దళారులతే అధికారుల అండ చూసుకుని ఏకంగా ఆలయాల నిర్వహణ బాధ్యతలను కూడా తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. దీంతో పలు దేవాలయాల్లో అవినీతి అక్రమాలతో పాటు ధర్మ విరుద్ధ చర్యలు పెరిగిపోతున్నాయి. ఆర్థిక కుంభకోణాల సంఖ్య అంతకు రెండింతలు పెరుగుతూ వస్తుంది.

తిరుప‌తి లడ్డూ వ్యవహారంతో..

కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి లడ్డూలో.. కల్తీ నెయ్యి వ్యవహారంతో ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారణ చేప‌ట్టాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్ఠత ఉంటుంది. అయితే.. కొంతమంది పాలకులు, అధికారులు వాటికి గండి కొడుతున్నారు. వారి అండదండలు చూసుకుని దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారులు కూడా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బ‌తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రసాదాల్లో చోటు చేసుకుంటున్న ఆక్రమాలు, అందుకు సంబంధించిన ముడి సరుకు కొనుగోళ్లలో జరుగుతున్న ఆక్రమాలను పూర్తి స్థాయిలో అరికట్టడానికి, అవినీతి కార్యకలాపాలకు చెక్ పెట్టాలన్నా అందుకు సర్వ రోగనివారిణిగా టాస్క్ ఫోర్స్ లేదా స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేసి 24 గంటలు ఆలయాల్లో పర్యవేక్షణ జరిగేలా చూడాతనలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా ఆధ్యాత్మిక వేత్తల నుండి కూడా డిమాండ్ పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement