Tuesday, April 23, 2024

అందాల పోటీల్లో వేదికపైనే జరిగిన ‘కిరికిరి’

‘మిసెస్‌ శ్రీలంక’ పోటీ ఫైనల్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విజేతగా ప్రకటించిన అనంతరం కిరీటం ధరించిన ఓ మహిళకు ఘోర అవమానం జరిగింది. భర్తతో విడాకులు తీసుకున్నందున ఆమె గెలుపునకు అర్హురాలు కాదంటూ మిసెస్‌ శ్రీలంక వరల్డ్‌, మాజీ మిసెస్‌ శ్రీలంక, ఆమె తలపైనున్న కిరీటాన్ని లాగిపడేశారు. ఈ క్రమంలో సదరు మహిళ అవమానభారంతో వేదిక మీది నుంచి వెళ్లిపోయారు. ఆదివారం జరిగిన అందాల పోటీల్లో శ్రీమతి పుష్పిక డి సిల్వా విజేతగా నిలిచారు.

అయితే ఇక్కడే వచ్చింది మొదలైంది అసలు కిరి కిరి. విజేతగా ప్రకటించిన పుష్పికా డి సిల్వాకు తలపై కిరీటం అలంకరించగా.. ఆమె ఆనందంతో మరోసారి ర్యాంప్‌వాక్‌ చేసింది. ఇంతలో హడావిడిగా అక్కడికి వచ్చిన మాజీ విన్నర్‌ కరోలిన్‌ జూరీ ఒక్కసారిగా సిల్వా కిరీటాన్ని తీసేసి పక్కనే నిలుచుని ఉన్న మొదటి రన్నరప్‌‌కు అలకరించారు.

ఈ క్రమంలో సిల్వా జుట్టు మొత్తం చెదిరిపోయింది. కరోలిన్‌ ప్రవర్తనతో ఖంగుతిన్న సిల్వా అక్కడి నుంచి అవమానభారంతో వేదిక దిగి వెళ్లిపోయారు. ఈ విషయం గురించి కరోలిన్‌ వివరణ ఇస్తూ.. ‘వివాహితలకు మాత్రమే విజేతగా నిలిచే హక్కు ఉంటుంది. విడాకులు తీసుకున్న వారికి కాదు’ అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన సిల్వా ‘నేను విడాకులు తీసుకోలేదని, నాపై నిందలు వేసిన వారే నా విడాకుల పత్రాలు చూపించాలి’ అంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మిసెస్‌ శ్రీలంక వరల్డ్‌ నేషనల్‌ డైరెక్టర్‌ చండీమాల్‌ జయసింఘే, తొలుత విజేతగా ప్రకటించిన మహిళకే కిరీటం దక్కుతుందని స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement