Thursday, April 25, 2024

మంత్రులు, ఎమ్మెల్యేలకు షాక్.. సర్వే, ఫీడ్ బ్యాక్ ఆధారంగా టిక్కెట్ల కేటాయింపు..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడున్న వ్యతిరేక పరిస్థితులను దాటుకుని ముందుకువెళ్లడానికి పార్టీ చీఫ్ అన్ని విధాలుగా సమాయత్తం చేస్తున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఈ రోజు ఫైనల్ చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) ప్రత్యేక భేటీ జరిగింది. పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాలకు 60 మందికి పైగా ఖరారు చేసిన లిస్ట్ ను స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే అనేకమార్లు పరిశీలించి ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫైనల్ లిస్టులో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు టిక్కెట్లు కోల్పోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి ఎమ్మెల్యేల పనితీరు, సర్వేలో వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘‘అభ్యర్థులకు సంబంధించి గెలుపు అనే అంశాన్నే పార్టీ కీలకంగా పరిగణించింది. అయితే, ముందే ప్రకటించినట్టు ‘ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్’ ఫార్ములా ప్రకారం కూడా చాలా మందికి టిక్కెట్లు దక్కకపోవచ్చు’’ అని కీలక నేత ఒకరు అన్నారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీకి పంజాబ్ లో చాలా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఎందుకంటే పాత ప్రత్యర్థి శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్ లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మొన్నటిదాకా సీఎంగా ఉన్న వ్యక్తి.. తిరుగుబాటు లీడర్ అయిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా పోటీలో ఉండనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్), అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకునేందుకు ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు పంజాబ్ బీజేపీ ఇన్‌చార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.

2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీని గెలుచుకుంది. 10 సంవత్సరాల తర్వాత SAD-BJP ప్రభుత్వాన్ని గద్దె దించింది. 117 మంది సభ్యుల పంజాబ్ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాలను గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) 15సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది, బీజేపీ 3 సీట్లు సాధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement