Monday, March 25, 2024

గోవాలో బీజేపీకి షాక్‌.. పార్టీకి లక్ష్మీకాంత్‌ రాజీనామా, ఇండిపెండెంట్‌గా పోటీ

గోవాలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి మనోహర్‌ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌ బీజేపీకి గుడ్‌ బై చెప్పేసిన కొన్ని గంటల్లోనే.. మాజీ సీఎం లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ ఆ పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మాండ్రెం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. టికెట్‌ ఇచ్చే ఆలోచనలో పార్టీ లేదని, ప్రజలు మాత్రం తనను పోటీ చేయాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. పార్టీకి చెందిన పనులు పూర్తి చేయడానికి రెండు రోజులు పడుతుందని, ఇతర పార్టీలు సంప్రదించాయని, కానీ వెళ్లే ఆలోచన తనకు లేదన్నారు. కాంగ్రెస్‌పై ఎలాంటి ఆశలు లేవన్నారు.

మాండ్రెం నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్యే దయానంద్‌ సోప్టేకు బీజేపీ అవకాశం ఇచ్చింది. దీంతో లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ రాజీనామా చేస్తానని ప్రకటించారు. 2014 నుంచి 2017 వరకు గోవాకు సీఎంగా సేవలందించారు. సీఎం మనోహర్‌ పారికర్‌ రక్షణ మంత్రిగా వెళ్లగా.. పర్సేకర్‌కు సీఎం బాధ్యతలప్పగించారు. 2017లో కాంగ్రెస్‌ అభ్యర్థి సాప్టే చేతిలో పర్సేకర్‌ 4వేల ఓట్ల తేడాతో పర్సేకర్‌ ఓడిపోయారు. 2019లో మరో 9మంది నేతలతో దయానంద్‌ బీజేపీలో చేరారు. గోవాలోని 40 స్థానాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. 34 మంది అభ్యర్థుల జాబితా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement