Thursday, April 18, 2024

భారత్ కు సాయం చేస్తామన్న దాయాది పాక్

భారతదేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం లక్షల్లో కరోనా కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. భార‌త్‌ లో క‌రోనా కేసులు ఊహించ‌ని రీతిలో పెరిగిపోతోన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే అభివృద్ధి చెందిన ప‌లు దేశాలు భార‌త్‌కు సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించాయి. తాజాగా దాయాది పాకిస్థాన్ కూడా భార‌త్‌కు సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి ట్వీట్ చేశారు.

కొవిడ్-19 విజృంభ‌ణ‌తో పోరాటం చేస్తున్న భారత్ కు సంఘీభావం తెలియజేస్తున్నామ‌ని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో భార‌త్‌ కు త‌మ వంతు సాయంగా వెంటిలేటర్లతో పాటు డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రాలు, పీపీఈ కిట్లు వంటి వైద్య ప‌రిక‌రాలు అందించేందుకు సిద్ధమ‌ని చెప్పారు. వాటిని వీలైనంత త్వర‌గా భారత్‌ కు సరఫరా చేసేలా భార‌త్‌-పాక్‌ అధికారులు కృషి చేయాలని తెలిపారు. కొవిడ్‌ పై చేస్తోన్న పోరాటంలో సాయం చేయడానికి ఏయే మార్గాలు ఉన్నా వాటి కోసం అన్వేషించాలని అన్నారు.

భ‌యంక‌రమైన కొవిడ్-19తో పోరాడుతున్న భార‌త ప్ర‌జ‌ల‌కు త‌న‌ సంఘీభావం తెలుపుతున్నానని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు., కరోనాతో బాధ‌ప‌డుతున్న‌ భార‌త్‌తో పాటు ప్ర‌పంచ దేశాల‌ ప్ర‌జ‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నామన్నారు. ప్ర‌పంచానికి స‌వాలు విసురుతోన్న కరోనాపై అంద‌రం క‌లిసి పోరాడాలని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement