Tuesday, April 23, 2024

నిప్పుల కుంపటిగా తెలంగాణ – వడ దెబ్బకు ఏడుగురు దుర్మరణం

హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలు మంగళవారం కూడా కొనసాగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల కొలిమిని తలపించింది. ఆ జిల్లాలోని మునగాలలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లాలోని దామరచర్లలో 45.1 డిగ్రీలు, భద్రాద్రి, జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ 44 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో సాధారణం కన్నా 3.8 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో సాధారణం కన్నా 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత అదనంగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ 49 శాతం కన్నా తక్కువ ఉంది. రామగుండంలో 12 శాతం, నిజామాబాద్‌లో 21 శాతమే తేమ కొనసాగింది. బుధవారం రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని, గురువారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

మరోవైపు ఎండల ధాటికి అనేకమంది వడదెబ్బ బారిన అస్వస్థతకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఏడుగురు మృత్యువాత పడ్డారు. నల్గొండ సమీపంలోని చర్లపల్లి ప్రాంతానికి చెందిన మారోజు రాములు(74) సోమవారం రాత్రి వడదెబ్బతో చనిపోయినట్లు నల్గొండ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం పంచాయతీ చింతోనిగుంపు గ్రామానికి చెందిన మహిళ జోగ ఉపేంద్ర(38) సోమవారం తునికాకు సేకరణకు వెళ్లి వడదెబ్బకు గురై మంగళవారం ఆసుపత్రిలో కన్నుమూశారు. మంచిర్యాలలోని జాఫర్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ మొహమ్మద్‌ సలీం(32) మంగళవారం బయటకు వెళ్లి వచ్చి నీరసంతో కుప్పకూలి మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం గిన్నెర పంచాయతీ పరిధిలోని బొప్పపూర్‌కు చెందిన యువ రైతు ఏర్మా హన్మంత్‌రావు(29) పొలం వెళ్లొచ్చి వాంతులు చేసుకుని కన్నుమూశారు. కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు చనిపోయారు. మల్దకల్‌ మండలం కుర్తిరావులచెర్వు గ్రామానికి చెందిన మోషన్న (57), రేవల్లి మండల పరిధిలోని చీరకపల్లి గ్రామానికి చెందిన బంకల బాల్‌నాగయ్య (55), వనపర్తి పట్టణంలో గుర్తుతెలియని వృద్ధుడు(65) కన్నుమూశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement