Saturday, December 7, 2024

సృజనాత్మక ఆవిష్కరణలతో వైజ్ఞానిక ప్రగతి .. ఘనంగా ఏపీ ఎస్ఆర్ఎం వర్సిటీ స్నాతకోత్సవం

మంగళగిరి రూరల్, (ప్రభ న్యూస్) : ఇంజినీరింగ్ విద్యార్థులు నూతన సృజనాత్మక ఆవిష్కరణలకు ప్రాణం పోయాలనీ, అప్పుడే వైజ్ఞానిక ప్రగతి పరుగులు తీస్తుందని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఆండ్రూ డి. హామిల్టన్ అభిప్రాయపడ్డారు, కరోనా కష్టకాలంలోనూ ఏపీ ఎస్ఆర్ఎం విద్యార్థులు మేథస్సుకు పదును పెట్టి ఉత్తమ ఫలితాలను సాధించడం విశేషమన్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఎస్ఆర్ఎం వర్సిటీ కులపతి మరియు ఎంపీ డాక్టర్ టీఆర్ పారివేందర్ అధ్యక్షతన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం జరిగింది.

న్యూయార్క్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఆండ్రూ డి. హామిల్టన్ (న్యూయార్క్) ముఖ్య అతిథిగా దృశ్య మాధ్యమ పద్ధతి (వర్చువల్)లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం యాజమాన్యాన్ని, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులను అభినందించారు. గొప్ప చరిత్ర కలిగిన యూనివర్సిటీలతో అనుబంధాన్ని కలిగి ఉన్న తాను ఆంధ్రప్రదేశ్లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రగతి చూసి విస్మయానికి గురయ్యానన్నారు. భవిష్యత్తు కాలంలో ఉన్నత విద్యకు విశేషమైన ప్రాధాన్యం ఒనగూరనుందనీ, చీకటి నుంచి వెలుగును ప్రసరింపజేయడానికి విశ్వవిద్యాలయాలు సరికొత్త బాటలు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ యూనివర్సిటీ సందర్శించాలని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యాన్ని, విద్యార్థులను కోరారు.

స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ను అందుకున్న నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (యూఎస్ఏ) డైరెక్టర్ డాక్టర్ సేతురామన్ పంచనాథన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిబద్ధత, నిజాయితీలతో మెలగాలని కోరారు. విద్యార్థులు తమకున్న సామర్థ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పర్చుకోవాలన్నారు. భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ టీఆర్ పారివేందర్ మాట్లాడుతూ, దేశంలో సరికొత్త విద్యా అవసరాలను తీర్చాలన్న దృక్పథంతో ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీని స్థాపించడం జరిగిందన్నారు. విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విద్యను అందించడంమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు.

జాతీయ విద్యా విధానం -2020లో పొందుపర్చిన విధంగా ఏపీ ఎస్ఆర్ఎంలో విద్యాబోధన, పరిశోధనలు సాగుతున్నాయని యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ పి సత్యనారాయణన్ పేర్కొన్నారు. యూనివర్సిటీ పరంగా పరిశోధనలను విస్తృత పరుస్తున్నామన్నారు. కొత్త యూనివర్సిటీ అయినప్పుటికీ అనతి కాలంలో అన్ని విధాలా ఏపీ ఎస్ఆర్ఎం అభివృద్ధి సాధించడం గర్వకారణంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వజ్జా సాంబశివరావు యూనివర్సిటీ ప్రగతిని వివరించారు. తొలి బ్యాచ్ విద్యార్థులు సాధించిన విజయాలను, దక్కించుకున్న ప్లేస్మెంట్లను, ఏర్పాటు చేసిన స్టార్టప్ లను నివేదించారు. యూనివర్సిటీ యాజమాన్యం కల్పించిన విద్యాసదుపాయాలను కొనియాడారు. అనంతరం తొలి బ్యాచ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. మెరిట్ విద్యార్థులకు బంగారు పతకాలను ప్రకటించారు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ సేతురామన్ గౌరవ డాక్టరేటు అందుకున్న ఇదే స్నాతకోత్సవంలో డిగ్రీలు అందుకోవడం పలువురు విద్యార్థులు అదృష్టంగా భావించారు. ఈ కార్యక్రమంలో చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. ముత్తమై సెల్వన్, ఎస్ఆర్ఎం వర్సిటీ ప్రొ-వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి నారాయణరావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమకుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement