Thursday, April 25, 2024

తెలంగాణలో పాఠశాలల పున:ప్రారంభం యధాతథం

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను తెరువాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నుంచి పాఠశాలల పున:ప్రారంభం యధాతథంగా జరగనుంది. కోర్టు ఆదేశాలకు అనుకూలంగా ఆఫ్‌ లైన్‌తో పాటు ఆన్‌ లైన్‌లోనూ తరగతులను కొనసాగించనున్నారు. హైకోర్టులో తదుపరి విచారణ వరకు గురుకులాలను మూసివేయనున్నారు

రెసిడెన్షియల్‌, సాంఘి సంక్షేమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలను కొవిడ్‌ నిబంధనల మేరకు తెరిచేందుకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ తరగతులకు అనుమతి ఇచ్చింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను పాఠశాలలు బలవంతపెట్టొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆన్‌లైన్‌, ప్రత్యక్ష బోధన అంశంపై పాఠశాలలదే నిర్ణయమని పేర్కొంది. పాఠశాలలు అనుసరించాల్సిన విధివిధాలను రూపొందించాలని ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధనకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రత్యక్ష బోధన వద్దని వేసిన ఆ పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే ప్రత్యక్ష బోధనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యక్ష బోధన కోసం పాఠశాలలకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు సూచించింది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని, అలాగే ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని, వారంలోగా మార్గదర్శకాలు విడుదల చేయాలని విద్యాశాఖను ఆదేశించింది.

పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతిగృహాలు తెరవద్దని ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని, సెప్టెంబరు, అక్టోబరులో మూడో దశ పొంచి ఉందని హెచ్చరికలు ఉన్నాయని, అలాగే విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఈ రెండింటిని సమన్వయం చేసి చూడాలని హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: థర్డ్ వేవ్ కి ఆ కొత్త వేరియంట్ కారణమవుతుందా..?

Advertisement

తాజా వార్తలు

Advertisement