Thursday, April 25, 2024

ఏపీ సీఎం జగన్ కోసం పాదయాత్ర.. తెలంగాణ యువకుడి సాహసయాత్ర

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఏపీ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఆయనకు ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. జగన్‌పై ఉన్న అభిమానంతో జగనన్నని ఒక్కసారైనా నేరుగా చూడాలంటూ తెలంగాణకు చెందిన ఓ యువకుడు అనుకున్నాడు. సీఎం జగన్ పై ఉన్న అభిమానంతో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన పబ్బు కిషోర్‌ అనే యువకుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు జులై 8న దివంగత మాజీ సీఎం వైఎస్ జయంతి సందర్భంగా పాదయాత్ర మొదలు పెట్టాడు. తన స్వగ్రామం నుంచి సీఎం జగన్‌ను చూసేందుకు కాలినకడన బయలుదేరాడు. 

దాదాపు వారం రోజులపాటు నడుస్తూ ఇవాళ అతడు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నాడు. అయితే తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకున్న యువకున్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అపాయింట్ మెంట్ లేకపోవడంతో పోలీసులు కిషోర్ ను అడ్డుకున్నారు. లోపలికి పంపించలేదు. సీఎంను కలవకుండా వెళ్లేది లేదంటూ కన్నీరు పెట్టుకుంటూ అక్కడే కూర్చున్నాడు. దీంతో సదరు యువకున్ని పోలీసులు స్టేషన్ కు తరలించారు. సీఎం జగన్ పై అభిమానంతో వస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ కిషోర్ ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం నివాసం చేరుకోవడానికి ఆరు రోజులు పట్టిందని తెలిపాడు. సీఎం జగన్ ని కలిసే వరుకు వెనక్కి వెళ్ళేది లేదని స్పష్టం చేశాడు. ప్రత్యేక వినతి లేదని కేవలం అభిమానంతో సీఎం జగన్ ని కలవటానికి వచ్చానని చెప్పాడు. తన కోరిక నెరవేర్చాలని కోరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement