Thursday, April 25, 2024

నెల గడిచి 16 రోజులైన ఆర్టీసీ కార్మికులకు జీతాల్లేవు!

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులంతా పీఆర్సీ సంబురంలో ఉంటే.. ఆర్టీసీ కార్మికులు మాత్రం జీతాలు రాక ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. జూన్ 16 వచ్చినా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇంకా అందలేదు. ఆర్టీసీలో జీతాలు ఆలస్యమవుతుండడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. నెల గడిచి 16 రోజులు అవుతున్నా.. ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడంతో పూట గడవడం ఇబ్బందిగా ఉందని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్‌ వచ్చి 16 రోజులైనా ఉద్యోగులకు మే నెల వేతనాలు ఇంకా ఖాతాల్లో జమ కాలేదు. దీంతో రుణ వాయిదాల చెల్లింపు, ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. ఇంటి అద్దెలు చెల్లించక, నిత్యావసర సరుకులు లేక దినదినగండంగా వారి బతుకు మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో పరిస్థితి ఆధ్వాన్నంగా తయారైందన్నారు. 

రాష్ట్రంలో మొన్నటి వరకు లాక్‌డౌన్​కొనసాగినా ఆర్టీసీ కార్మికులు మాత్రం యధాతథంగా విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ లాక్‌డౌన్​ నిబంధనలు వర్తించినా వేతనాలు మాత్రం నెల ప్రారంభంలోనే జమ అయ్యాయి. అయితే, ఆర్టీసీ కార్మికులు మినహా అందరికీ వేతనాలు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వేతన సవరణ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్టీసీ కార్మికులకు మినహా అందరికీ 30 శాతం వేతనాలు పెరిగాయి. ఆర్టీసీ కార్మికులకు మాత్రం రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయి. వాస్తవంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు కూడా వేతనాలు పెరుగుతాయని ప్రకటించారు. కానీ, దీనిపై ఎక్కడా క్లారిటీ లేదు. ప్రస్తుతం వేతనాల పెంపు పక్కనపెడితే ఇవ్వాల్సిన జీతాలే ఇవ్వడం లేదు. లాక్‌డౌన్‌తో ఆర్టీసీ ఆదాయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

రెండు నెలల వరకు ప్రతిరోజు ఆర్టీసీ ఆదాయం రూ.13 కోట్లుగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు కేవలం రూ. రెండు కోట్లు కూడా దాటడం లేదు. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా క్రమంగా ఆర్టీసీ సర్వీసులను పెంచుతున్నారు. దీంతో ప్రస్తుతం రూ. 2 కోట్లకు వరకు ఆదాయం వస్తోంది. అటు రోజువారీ ఖర్చులు తగ్గడం లేదు. అంతరాష్ట్ర సర్వీసులన్నీ ఆపేశారు. దీంతో ఇప్పుడు కార్మికులకు చెల్లించాల్సిన జీతాలపై మళ్లీ ఎఫెక్ట్ పడింది.  ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల వేతనాల, మెడికల్​ బిల్లులు, ఇతర అత్యవసర ఖర్చుల కోసం రూ. 118.87 కోట్లు అవసరమున్నాయి. ఇలాంటి స్థితిలో మళ్లీ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పలు అవసరాల కోసం రూ. 1000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా ఇంకా చేతికి అందలేదు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి  ఆర్టీసీలో మొదటి తారీఖు జీతం అనే ముచ్చట ఎప్పుడో మర్చిపోయినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. మరో మార్గం లేక ఆందోళనకు దిగుతున్నామని చెప్పారు. జీతాలకోసం కార్మికులు అన్ని డిపోలవద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కార్మికులు, ఉద్యోగుల ఆందోళనకు యూనియన్లు మద్దతు పలికి సంఘీభావం తెలుపుతున్నాయి.  రోజుకు 16 గంటల పాటు పనిచేస్తున్నా జీతాలు సకాలంలో చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు.

ఇదీ కూడా చదవండి: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పోస్టింగ్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement