Wednesday, April 24, 2024

పబ్లిక్ పల్స్ దొరకబట్టిన సజ్జనార్.. ఆర్టీసీ ఫ్యూచర్ కి బాటలు..

ప్ర‌భ‌న్యూస్ : ఏ సంస్థ అయిన వ్యాపార రంగంలో రాణించాలంటే వినియోగదారుల అభిప్రాయాల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని చాలా కాలం తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) గుర్తించి ప్రవర్తిస్తోంది. ఫలితంగా సంస్థ ఇటీవల కాలంలో పురోభివృద్ధి దిశలో పయనిస్తోంది. ఇన్నాళ్ళూ సంస్థను నిర్లక్ష్యం చేసిన అధికారులే ఇప్పుడు పురోభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. నిన్నటి వరకు ఈ సంస్థ ఇక బతకదని వ్యాఖ్యానించిన వారే ఇప్పుడు భవిష్యత్‌ బ్రహ్మాండంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని కరోనా మరింత చిన్నాభిన్నం చేసింది. అంతవరకు కుంటుతూ సాగుతున్న సంస్థ కరోనా కాటుతో పూర్తిగా చతికిల పడే పరిస్థితికి చేరుకుంది.

సంస్థను ఎలాగైన బతికించాలన్న ఉద్దేశ్యంతో సమర్థవంతమైన అధికారిగా పేరొందిన సజ్జనార్‌ను ఎండీగా నియమించారు. సంస్థ స్థితిగతులు, ఆదాయ వ్యయాలు, సిబ్బంది పనితీరుపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సజ్జనార్‌ సంస్థకు కాయకల్ప చికిత్స ప్రారంభించారు. ఆయన చికిత్సతో అవసానదశకు చేరుకున్న ఆర్టీసీ కొంత మెరుగైంది. ఫలితంగా సంస్థకు రూపాయి అప్పు కూడా ఇచ్చేందుకు ఇష్టపడని బ్యాంకర్లు ఇప్పుడు ఓడీ రూపంలో అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో సంస్థలోని ఉద్యోగులకు నెల కాగానే ఠంచన్‌గా వేతనాలు అందుతున్నాయి.

పాత రూట్లలో తిరుగుతున్న కొన్ని బస్సులను రద్దు చేసి కొత్త మార్గాలలో తిప్పాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రూట్లలో బస్సులు ప్రయాణికుల సగటు కంటే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఆయా రూట్లలోని కొన్ని బస్సులను కొత్త రూట్లకు మళ్లించనున్నారు. మెట్రో రైల్‌ అనంతరం నగరంలోని కొన్ని ప్రధాన మార్గాలలో ప్రయాణికుల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ అధికారులు బస్సులను మాత్రం నడుపుతున్నారు. ఇదే తరహాలో కొన్ని జిల్లాలలోని రూట్లలోనూ వ్యత్యాసాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలలో ప్రజలకు అవసరమైన విధంగా బస్సులను అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement