Sunday, March 17, 2024

Big Story: సేఫ్ పాలిట్రక్స్​.. ఇద్దరు సీఎం క్యాండిడేట్ల‌ది అదే తీరు.. ఇంకా తేల్చుకోని ప్రియాంక‌..

(స్వరూప పొట్లపల్లి, ఆంధ్రప్రభ ఢిల్లీ బ్యూరోచీఫ్)

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు ఖరార‌య్యాయి. ప్రస్తుత సీఎం, బీజేపీ అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ తన కంచుకోట ‘గోరఖ్‌పూర్ సదర్’ నుంచి పోటీ చేయడం ఖరారవగా, తాజాగా మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అఖిలేశ్ యాదవ్ పోటీ చేసే స్థానం కూడా ఖరారైంది. అఖిలేశ్ స్వగ్రామానికి అతి సమీపంలోని ‘కర్హల్’ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. మరో ప్రధాన రాజకీయ పక్షం బహుజన్ సమాజ్ పార్టీ సీఎం అభ్యర్థి మాయావతి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తున్నారు తప్ప తాను మాత్రం పోటీ చేయడం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రధానంగా పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యనే నెలకొన్నప్పటికీ, వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోడానికే సాహసించలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఏ ఎన్నికల్లోనైనా ముఖ్య నేతలు, రాష్ట్రమంతటా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి తాము పోటీ చేసే స్థానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తమకు అన్నివిధాలుగా అనుకూలం అనుకున్న నియోజకవర్గం నుంచే పోటీ చేస్తుంటారు. తద్వారా ఆ నేతలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయోగాలు చేస్తే సొంత సీటులో గెలుపు కోసమే అపసోపాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఒక్కోసారి రాజకీయంగా అదనపు ప్రయోజనం ఉందని భావిస్తే, ముఖ్య నేతలు ప్రయోగాలు కూడా చేస్తుండడం మనం చూస్తున్నాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీయే ఇందుకు ఉదాహరణ. 2014 ఎన్నికల్లో తన సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం వారణాశి (కాశీ) నుంచి బరిలోకి దిగారు. ఈ వ్యూహాత్మక అడుగు కారణంగా మోదీ అనుకూల పవనాలు యూపీ, బిహార్ రాష్ట్రాల్లో మరింతగా విస్తరించి, రికార్డు స్థాయిలో అత్యధిక సీట్లను కైవసం చేసుకోగల్గింది. అయితే ఈ తరహా ప్రయోగాలు ఒక్కోసారి బెడిసికొట్టే ప్రమాదమూ లేకపోలేదు.

తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి, అఖిలేశ్
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే.. అటు బీజేపీ, ఇటు సమాజ్‌వాదీ పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు సేఫ్ సీట్లనే ఎంపిక చేసుకున్నారు. నిజానికి సీఎం యోగి ఆదిత్యనాథ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇద్దరూ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసినా, ఇద్దరూ శాసన మండలి నుంచే ప్రాతినిధ్యం వహించారు తప్ప ఇంతవరకు ఎమ్మెల్యేలుగా లేరు. అలాగని ఎన్నికలను ఎప్పుడూ ఎదుర్కోలేదా అంటే, లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఎంపీలుగా పనిచేశారు. అఖిలేశ్ ఇప్పటికీ ఆజంగఢ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిరావడంతో ఇద్దరూ సురక్షితమైన నియోజకవర్గాలనే ఎంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ సదర్ నుంచి పోటీ చేస్తారని తెలిసిన వెంటనే స్పందించిన అఖిలేశ్ యాదవ్, బీజేపీ అప్పుడే యోగిని ఇంటికి (సొంత గడ్డ) పంపించేసిందంటూ ఎద్దేవా చేశారు. కానీ చివరకు అఖిలేశ్ కూడా సొంత ఇలాఖా నుంచే పోటీకి దిగక తప్పలేదు.

సమాజ్‌వాదీ కంచుకోట ‘కర్హల్’
ప్రస్తుతం ఆజంగఢ్ నుంచి ఎంపీగా ఉన్న అఖిలేశ్ యాదవ్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అనగానే తొలుత ఆజంగఢ్‌లోని ‘గోపాల్‌పూర్’ నియోజకవర్గం, బదౌన్‌లోని ‘గున్నౌర్’ నియోజకవర్గాలు పరిశీలనలోకి వచ్చాయి. అయితే ఈ రెండింటి కంటే ‘కర్హల్’లో పోటీచేయడమే అత్యంత సురక్షితమని భావించారు. ఇందుకు 1993 నుంచి సమాజ్‌వాదీ పార్టీకి ఓటమి ఎరుగని స్థానంగా కొనసాగుతండడమే కారణం. సమాజ్‌వాదీ ఓటుబ్యాంకు యాదవుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం కర్హల్. పైగా అఖిలేశ్ స్వస్థలం సైఫైకి కేవలం 5 కి.మీ దూరంలో ఉంటుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ వేవ్ సునామీలా రాష్ట్రమంతటా కనిపించి, భారీ సంఖ్యలో సీట్లను తెచ్చిపెట్టినా, ఈ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఏకంగా 38 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇన్ని అనుకూలతలు ఉన్నందునే అఖిలేశ్ ఈ నియోజకవర్గాన్ని ఖరారు చేసుకున్నారు. తద్వారా తాను పోటీ చేసే చోట ప్రచారం చేయకున్నా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

యోగి విషయంలోనూ ఇలాగే..
సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలనుకున్నప్పుడు ఎక్కణ్ణుంచి పోటీ చేయాలనే చర్చ జరిగింది. ఈ క్రమంలో హిందూ ఓటుబ్యాంకును జాగృతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపాలంటే రామమందిర నినాదాన్ని నిజం చేసి చూపిస్తున్న ‘అయోధ్య’ సరైన వేదిక అనుకున్నారు. లేదంటే పశ్చిమ యూపీలో రైతు ఆందోళనల ఫలితంగా, రాష్ట్రీయ లోక్‌దళ్ – సమాజ్‌వాదీ పార్టీల పొత్తుల కారణంగా బీజేపీ సవాళ్లు ఎదురవుతున్న నేపత్యంలో ‘మథుర’ నుంచి పోటీ చేయాలన్న చర్చ కూడా జరిగింది. అయితే అయోధ్య గ్రామీణ ప్రాంతాల్లో అంత సానుకూలత లేదని తెలిసింది. కొత్త ప్రాంతాల్లో ప్రయోగాలు చేస్తే వచ్చే ప్రయోజనం కంటే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ప్రచారంపై దృష్టి పెట్టడమే ముఖ్యమని కమలనాథులు భావించారు. అందుకే యోగి ఆదిత్యనాథ్‌కు పట్టున్న గోరఖ్‌పూర్ సదర్‌ నుంచే పోటీ చేయాలని నిర్ణయించారు.

గోరఖ్‌పూర్ ప్రాంతం బీజేపీకి, హిందుత్వ శక్తులకు గత కొన్ని దశాబ్దాలుగా కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. 1989 నుంచి జరిగిన దాదాపు ప్రతి ఎన్నికల్లో బీజేపీ గెలుపొందుతూ వచ్చింది. గోరఖ్‌నాథ్ మందిరం, మఠం ప్రభావం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. 2002 నుంచి గోరఖ్‌పూర్ సదర్ నియోజకవర్గంలో యోగి ఆదిత్యనాథ్ సన్నిహితుడు డా. రాధామోహన్ దాస్ అగర్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2007లో బహుజన్ సమాజ్ పార్టీ, 2012లో సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రంలో అధికారం పీఠాన్ని కైవసం చేసుకున్నప్పటికీ, ఈ ప్రాంతంలో మాత్రం హిందుత్వ శక్తుల ఆధిపత్యమే కొనసాగింది. బీజేపీ, దాని అనుబంధ హిందూ సంఘాలకు అదనంగా ఇక్కడ యోగి ఆదిత్యనాథ్‌కు సొంత బలం, బలగం కూడా ఉంది. ఈ ప్రాంతంలో చురుగ్గా పనిచేస్తున్న హిందూ యువ వాహిని సంస్థ ద్వారా యోగి తన పట్టును కొనసాగిస్తున్నారు. ఈ తరహా పరిస్థితి అయోధ్య, మథుర ప్రాంతాల్లో లేదు.

ఎటూ తేల్చుకోలేకపోతున్న ప్రియాంక
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు తమ తమ స్థానాలను ఖరారు చేసుకోగా, బహుజన్ సమాజ్ పార్టీ సీఎం అభ్యర్థి తాను పోటీయే చేయడం లేదని స్పష్టం చేశారు. ఇక మిగిలిన మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థినే ఖరారు చేయలేదు. యూపీ యూత్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా పరోక్షంగానే తాను తప్ప ఇంకెవరున్నారు అంటూ ప్రియాంక గాంధీ సంకేతాలు పంపినప్పటికీ, మర్నాటికే తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థినే ఇంకా తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా లేదా అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకవేళ పోటీ చేయాలనుకున్నా.. ఎక్కణ్ణుంచి పోటీ చేయాలన్నదే ఆ పార్టీ ముందున్న అతి పెద్ద సవాలుగా మారింది.

ఎందుకంటే, యోగి, అఖిలేశ్ మాదిరిగా కంచుకోట అని చెప్పుకోదగ్గ సీటు 403 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీకి కనిపించడం లేదు. 1989 నుంచి యూపీలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ, రాయ్‌బరేలి, అమేఠీ స్థానాలను మాత్రం కొన్నాళ్ల పాటు కంచుకోటగా మార్చుకోగల్గింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరుసగా అక్కణ్ణుంచి పోటీ చేయడమే అందుకు కారణం. అయితే 2019 నాటికి ఆ పరిస్థితి కూడా తారుమారైంది. సోనియా గాంధీ ఎలాగోలా గెలవగల్గినా, రాహుల్ గాంధీ ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అమేఠీలో అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ చేజిక్కించుకోగా, రాయ్‌బరేలి పరిధిలోని రాయ్‌బరేలి ఎమ్మెల్యే (కాంగ్రెస్) అదితి సింగ్, హర్‌చంద్‌పూర్ ఎమ్మెల్యే (కాంగ్రెస్) రాకేశ్ సింగ్ ప్రస్తుతం కాషాయ కండువా కప్పుకుని బీజేపీ తరఫున పోటీకి తలపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తారా అన్నది సందేహాస్పదమే. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ తలపడని ప్రియాంక గాంధీ ఏం చేస్తారన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే మిగిలింది.

ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement