Saturday, April 20, 2024

రెండేళ్లుగా ప్రింట్ కాని రూ.2వేల నోటు

రూ.2వేల నోటు ముద్రణ దాదాపు ఆగిపోయినట్లేనా? నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ నూతనంగా తీసుకొచ్చిన రూ.2వేల నోట్ల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రం లోక్‌సభలో స్వయంగా ప్రకటన చేసింది. గత రెండేళ్లుగా రూ.2వేల నోటును ముద్రించడంలేదన్న విషయాన్ని కేంద్రం లోక్‌సభలో తెలియజేసింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2019 ఏప్రిల్‌ నుంచి ఒక్క నోటు కూడా ముద్రణ జరగలేదని తెలిపారు. 2018 మార్చి 30 నాటికి 3,362 మిలియన్ల రెండు వేల రూపాయల నోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నాయని ఠాకూర్‌ తెలిపారు. సంఖ్యాపరంగా మొత్తం నోట్లలో వీటి వాటా 3.27 శాతం కాగా.. విలువ పరంగా 37.26 శాతంతో సమానమని తెలిపారు.

2021 ఫిబ్రవరి 26 నాటికి 2,499 మిలియన్ల నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయని, సంఖ్యా పరంగా ఈ వాటా 2.01 శాతం కాగా.. విలువ పరంగా 17.78 శాతమని తెలిపారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్ని నోట్లు ముద్రించాలనేది ఆర్‌బీఐని సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఠాకూర్‌ తెలిపారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల నోటు ముద్రణకు సంబంధించి ప్రింటింగ్‌ ప్రెస్‌కు ఎలాంటి ఇండెంట్‌ వెళ్లలేదని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement