Friday, March 31, 2023

Spl Story | కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం.. పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరైన రాహుల్!

కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ వరకు దాదాపు 4 వేల కిలోమీటర్లకు పైగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. కాంగ్రెస్​ పార్టీకి పునరుజ్జీవం తీసుకురావాలని, విద్వేషాలతో రగిలిపోతున్న ప్రజలను ఏకం చేయాలన్న ముఖ్య కారణంతో రాహుల్​ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారంతో ముగిసింది. యాత్ర చివరి రోజు శ్రీనగర్‌లోని లాల్ చౌక్ సిటీ సెంటర్‌లో రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇది 75 సంవత్సరాల క్రితం జవహర్‌లాల్ నెహ్రూ అదే స్థలంలో జాతీయ జెండాను ఎగురవేసిన తీరును యాదికి తెస్తోంది.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

- Advertisement -
   

కాంగ్రెస్​ ముఖ్యనేత, వయనాడ్ ఎంపీ రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్రతో కాంగ్రెస్​ పార్టీని మళ్లీ పట్టాలెక్కించారు. దేశంలో బీజేపీ పెంచి పోషిస్తున్న విద్వేషాలను ప్రజలకు తెలియజేసేలా.. అందరికీతో కలిసి సాగుతూ ఎంతో పరిణీతి కనబరిచారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్​ వరకు నిర్వహించిన ఈ పాదయాత్ర రాహుల్​లోని మరో కోణాన్ని తెలియజేసింది. చిలిపితనం, కొంటెతనం వంటి విషయాలే కాకుండా ఓ మంచి మనిషిగా రాహుల్​ని ఈయాత్ర ప్రజల ముందు నిలబెట్టింది. ఇక.. లాల్ చౌక్‌లో జెండాను ఆవిష్కరించిన తర్వాత భారత్‌కు ఇచ్చిన హామీని నెరవేర్చుతానని రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, రణదీప్ సూర్జేవాలాతో పాటు పలువురు నేతలున్నారు.

భారత్ జోడో యాత్ర రివైండ్​..

  • భారత్​ జోడో యాత్ర 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. 2023 జనవరి 29న జమ్మూ కాశ్మీర్‌లో ముగిసింది. చివరి రోజు రాహుల్ గాంధీ లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. 75 ఏళ్ల క్రితం భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో తొలిసారిగా జాతీయ జెండాను ఎగరేశారు. ఆ ప్లేస్​కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు రాహుల్​ కూడా అదే ప్రదేశంలో జాతీయ జెండా ఎగరేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు.
  • ఈ యాత్ర ఐదు నెలల్లోపు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేసింది. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో పాదయాత్ర సాగింది.
  • కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో పలువురు రాజకీయ నేతలు రాహుల్ గాంధీ వెంట నడిచారు. జమ్మూ కాశ్మీర్‌లో చివరగా రాహుల్ గాంధీతో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా కలిసి నడిచారు.
  • ప్రముఖ నటుడు, మక్కల్​నీది మయ్యుమ్​ (ఎంకేఎం) చీఫ్ కమల్ హాసన్ న్యూఢిల్లీలో రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో నడిచారు.  మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్) నేత ఆదిత్య ఠాక్రే రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో చేరారు. గత ఏడాది సెప్టెంబర్‌లో తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​ కన్యాకుమారిలోని గాంధీ మండపంలో భారత్ జోడో యాత్ర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
  • భారత్ జోడో యాత్రలో పలువురు ప్రముఖ వ్యక్తులు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. ఈ జాబితాలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, నటి-చిత్ర నిర్మాత పూజా భట్, బాలీవుడ్ నటుడు స్వర భాస్కర్, నటీనటులు రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరి ఉన్నారు.
  • రాహుల్ గాంధీ భారతదేశం అంతటా భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న సమయంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 27 శాతం ఓట్లతో కేవలం 17 సీట్లు గెలుచుకోగా, 2017లో 77 సీట్లు గెలుచుకుని 41శాతం ఓట్లు సాధించింది. కాగా, హిమాచల్‌లో 68 మంది సభ్యుల అసెంబ్లీలో 40 సీట్లు గెలుచుకుని బీజేపీ నుంచి నెక్‌ టు నెక్‌ పోరు తర్వాత కాంగ్రెస్‌ అధికారాన్ని చేజిక్కించుకుంది.
  • పాదయాత్ర అంతలా ప్రధానంగా రాహుల్ గాంధీ  బుర్బెర్రీ టీ షర్ట్​ ధరించారు. అంతేకాకుండా సాదాసీదాగా అతని ఆహార్యం ఉంది. ఇక గడ్డం తీయకుండానే యాత్ర కొనసాగించారు. అయితే.. ఇక్కడ రాహుల్​ గాంధీ ధరించిన టీ షర్ట్​పై బీజేపీ పలు ఆరోపణలు చేసింది. 41వేల విలువైన బుర్బెర్రీ టీ షర్ట్ ధరించినందుకు రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శల దాడి చేసింది. కాగా, కాంగ్రెస్​ పార్టీ నేతలు కూడా అంతే స్థాయిలో బీజేపీపై ఎదురుదాడి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి “రూ. 10 లక్షల సూట్” అంటూ కాంగ్రెస్​ రియాక్ట్​ అయ్యింది. ఇక.. తమిళనాడులో వివాదాస్పద క్రైస్తవ మతగురువుతో రాహుల్ గాంధీ భేటీపై కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని బీజేపీ ఆరోపించింది.
  • కాగా, రాహుల్​ గాంధీ ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ విమర్శలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ నెరిసిన గడ్డం కూడా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.
  • ఇవే కాకుండా.. యాత్ర సమంలో చాలామంది చనిపోయారు. కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి పంజాబ్​లో గుండెపోటుతో మరణించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్త ఒకరు కుప్పకూలి చనిపోయారు. నాందేడ్‌లో పాదయాత్రలో పాల్గొన్న సమయంలో ట్రక్కు ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన 62ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. ఆ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి గాయపడ్డాడు.
Advertisement

తాజా వార్తలు

Advertisement