Thursday, April 25, 2024

9 ప్రశ్నలతో అమిత్ షాకు రేవంత్ రెడ్డి లేఖ

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు  9 ప్రశ్నలతో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. మోసానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌ కవల పిల్లలు అంటూ లేఖలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇద్దరూ కలిసి చేసిన మోసంతో పాటు… తెలంగాణ ఆత్మగౌరవం పై మోదీ దాడి, రైతుకు అన్యాయం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు… వీటిపై నా తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

‘’మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడప దాటడం లేదు అన్న సామెత కేంద్రంలోని మీ ప్రభుత్వానికి అతికినట్టు సరిపోతుంది. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మీ హామీ ఒట్టి బూటకం అని అర్థమైయింది. అన్నదాతల ఆదాయం రెట్టింపు సంగతి అటుంచి మీ పాలనలో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టయింది. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన మీ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తూ లక్షలాది మంది రైతులు రోడ్డెక్కారు. ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు వదిలారు. ఎరువుల సబ్సిడీలు ఎత్తివేసి రైతుల నెత్తిన బరువు మోపింది మీ ప్రభుత్వం. బ్యాంకులను వేల కోట్లకు ముంచిన బడాబాబులు దేశాన్ని వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే.. రైతుల రుణాలను మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మొత్తంగా మీ పాలనలో వ్యవసాయంలో గుణాత్మక మార్పు అన్నది జీరో.

ఇక తెలంగాణ విషయానికి వస్తే… బీజేపీ-టీఆర్ఎస్‌లు ఎనిమిదేళ్లు అంటకాగి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పథకాలన్నింటినీ ఇద్దరూ కలిసి విజయవంతంగా తుంగలో తొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడో సారి మీరు తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ సెంటిమెంట్ డైలాగులే తప్ప తెలంగాణ ప్రజలు, రైతులు, యువత సమస్యల పరిష్కారానికి మీరు ఇచ్చిన మాట లేదు.. చేసిన పనీ లేదు. కేసీఆర్ కుటుంబ అవినీతితో ఇప్పటికే వేల కోట్ల తెలంగాణ ప్రజల సంపద దోపిడీకి గురైతే.. మీరు చోద్యం చూస్తున్నారు. బొగ్గు స్కాం నుంచి భూముల స్కాం వరకు పలు ఫిర్యాదులు ఇచ్చినా స్పందించలేదు. ఇటీవల మీ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు. మీ పార్టీ రాష్ట్ర నాయకులేమో టీఆర్ఎస్ తో లడాయి అంటూ తొడలు కొడుతుంటారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేస్తోన్న మీ రెండు పార్టీల చీకటి సంబంధం తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో… 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి తెలంగాణకు వస్తున్న మీకు తెలంగాణ ప్రజలు, రైతులు, యువత తరఫున కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు మార్చి, రీ డిజైనింగ్ పేరుతో కేసీఆర్ కమీషన్లు దండుకుంటున్నారని మేం మొదటి నుండి ఆరోపిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఎటీఎంలా మారింది అని… మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇటీవల పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి జరిగింది అని అంగీకరిస్తున్న మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? దేశంలో ప్రతిపక్ష నేతలు, మీ సొంత పార్టీలో నిజాలు మాట్లాడే నేతల పై ఈడీ, సీబీఐ ద్వారా కొన్ని గంటల వ్యవధిలోనే దాడులు చేయించే మీరు ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా!?’’ అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement