Thursday, April 25, 2024

హుజురాబాద్ లో రాజకీయ వేడి.. ప్రచార బరిలో రేవంత్..

హుజురాబాద్ ఉపఎన్నిక వేడి పెంచుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తుండగా.. పార్టీల అగ్ర నాయకులు రంగంలో దిగుతున్నారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభను ఏర్పటు చేసింది. అటు బీజేపీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భారీ సభను ప్లాన్ చేసింది. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది.

హుజురాబాద్ ఉపఎన్నిక సమయం దగ్గర పడిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలు హుజురాబాద్ లోనే మకాం వేశారు. టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచార బరిలో దిగబోతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్‌ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. రేవంత్ రాకతో కొత్త జోష్ వచ్చింది. పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు రేవంత్ రెడ్డి తీవ్రగా కష్టపడుతున్నారు. ప్రభుత్వంపై ఎదురు దాడి చేయడంలో రేవంత్ కు సపరేట్ స్టైల్ ఉంది. బహిరంగ సభల్లో రేవంత్‌ రెడ్డి ప్రసంగించే విధానంతో కాంగ్రెస్‌ కు కరెక్టు నాయకుడు వచ్చాడని కార్యకర్తలు అంటున్నారు.

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ బరిలో ఉన్నారు. శనివారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రచారం చేయనున్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. రేవంత రెడ్డి ప్రచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శనివారం కరీంనగర్‌ నుంచి 3 గంటలకు వీణవంక చేరుకోనున్న రేవంత్‌ వీణవంక బస్టాండ్‌ ప్రాంగణంలో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం వీణవంక నుంచి జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ఇల్లందకుంటలో శ్రీరాములపల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడినుంచి కమలాపూర్‌ చేరుకొని బస్టాండ్‌ సమీపంలో ప్రచారం నిర్వహించనున్నారు

రేవంత్‌ పీసీసీగా నియామకమైన తరువాత వచ్చిన మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఉప ఎన్నిక ఆయనకు అగ్ని పరీక్షగా మారింది. గెలుపు ఓటముల సంగతి పక్కన బెడితే.. ఇది రేవంత్ కు అత్యంత కీలకమైన అంశం. తన నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కలిగించారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 వేల ఓట్లు సాధించింది. ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ఆ ఓట్ల సేఫ్ గా ఉన్నాయా? లేదా? అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి: మండిపోతున్న పెట్రోల్ ధరలు.. నేటి రేట్లు ఇవీ

Advertisement

తాజా వార్తలు

Advertisement