Thursday, April 25, 2024

దళిత బంధుకు దండోరాతో చెక్!

హుజురాబాద్ ఉపఎన్నిక వేళ.. కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త స్కెచ్ వేశారు. ముల్లును ముల్లుతోనే తీయాలని అన్నట్లు దళిత బంధు పథకాన్ని దళిత దండోరాతో చెక్ పెట్టాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దళిత బంధు పథకంపై ప్రజల దృష్టి పడకుండా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని రంగంలో దించబోతున్నారు. దళిత దండోరా గురించి రాహుల్ తో చ‌ర్చించాన‌ని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఈ కార్యక్రమాన్ని ఆయన రాబోతున్నట్టు వెల్లడించారు.

దళిత బంధు పేరుతో దళితుల కోసం కోట్లు రూపాయాలు ఖర్చు పెడుతున్నామని కేసీఆర్ సర్కార్ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో హుజురాబాద్ ఉపఎన్నికలో ఓట్లు కొల్లగొట్టాలని యోచిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న దాదాపు 50 వేల దళిత ఓటర్లను ఆకర్షించే పనిలో బీజీగా ఉన్నారు. దీంతో తెలంగాణలో అదే దళిత వర్గానికి చెందిన ప్రజలు పడుతున్న బాధలు, సమస్యలను రాష్ట్ర ప్రజలకు తెలిసేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే దళిత దండోరా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. జాతీయ మీడియా సైతం తెలంగాణవైపే చూసేలా రాహుల్ గాంధీని దళిత దండోరా కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ నెల 9నుంచి సెప్టెంబరు 17వరకూ జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాలో ఏదో ఒకరోజున రాహుల్‌గాంధీ పాల్గొంటారు. వరంగల్‌ను రాహుల్‌ సభకు ఎంచుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ సభలోనే హుజూరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించవచ్చని తెలుస్తోంది. రాహుల్‌గాంధీ 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. 

దళిత బంధు పథకాన్ని ఆగస్ట్ 16 నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే ముందే ఆగస్ట్ 9 నుంచి దళిత దండోరా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టనుంది. దళితులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు సహా వివిధ రకాలపై కాంగ్రెస్ పోరాటం చేయనుంది. హుజురాబాద్ బై పోల్ లో టీఆర్ఎస్ కు దళిత ఓట్లు పడకుండా అడ్డుకట్ట వేయాలన్నది రేవంత్ వ్యూహంగా తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ ట్వీస్ట్ ఇచ్చారు. ఆగస్ట్ 16 నుంచి దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తొలుత ప్రకటించిన కేసీఆర్… అనూహ్యం ఇప్పుడు దత్తత గ్రామం వాసాలమర్రి నుంచే తొలి పథకం పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే, ఈ విషయంలో రేవంత్ మాత్రం అచితూచి వ్యవహరిస్తున్నారు. దళిత దండోరా కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యతను కాంగ్రెస్ కార్యకర్తల మీదే పెట్టారు. ఆధిప‌త్య‌పోరుకు తావు లేకుండా, పార్టీ సమిష్టి నిర్ణయం మేరకే అన్ని పనులు జరగాలని హితబోధ చేశారు. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని చెప్పిన తేదీ కంటే ముందుగా ప్రారంభించినా.. దళిత దండోరాకు వచ్చిన నష్టం ఏమీ లేదనే ఆలోచనలో రేవంత్ ఉన్నారు. షెడ్యూల్ ప్రకారమే తమ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. హుజురాబాద్ ఎన్నిక వేళ.. రాబోయే రోజుల్లో దళితులు టీఆర్ఎస్ వైపు ఉంటారా? లేక కాంగ్రెస్ వైపు ఉంటారా? అన్నది చూడాలి.  

ఇది కూడా చదవండి: దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకివ్వరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement