Saturday, April 20, 2024

వారం, పది రోజుల్లో కీలక మార్పులు.. శాసనమండలి వైస్‌ చైర్మన్‌, చీఫ్‌ విప్‌, విప్‌ పదవుల భర్తీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శాసనమండలి చైర్మన్‌ పదవిని భర్తీ చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వైస్‌ చైర్మన్‌, చీఫ్‌ విప్‌, విప్‌ల ఖాళీల భర్తీని త్వరలోనే చేపడతారన్న ప్రచారం తెరాసలో సాగుతోంది. మంగళవారంతో శాసనమండలి సమావేశాలు ముగుస్తుండడంతో ఈ నియామకాలను వచ్చే వారం, పది రోజుల్లో చేపట్టే అవకాశముందని తెరాస ముఖ్య నేతరు ఒకరు చెప్పారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ ఈ పదవులతో పాటు మరిన్ని కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండలి చైర్మన్‌ పదవిని గుత్తా సుఖేందర్‌రెడ్డికి కట్టబెట్టడంతో వైస్‌ చైర్మన్‌గా బీసీ సామాజిక వర్గానికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకొని చీఫ్‌ విప్‌, విప్‌ల పదవులకు నేతలను ఎంపిక చేసే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం. శాసనమండలిలో చీఫ్‌ విప్‌తో పాటు మరో మూడు పదవులను భర్తీ చేయాల్సి ఉంది.

గత ఏడాది జూన్‌ మొదటి వారంలో చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. విప్‌లుగా ఉన్న కర్నె ప్రభాకర్‌ గత ఏడాది మార్చిలో రిటైర్‌ కాగా మరో ఇద్దరు విప్‌లు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, టి.భానుప్రసాదరావులు తాజాగా జరిగిన స్థానిక కోటా ఎన్నికల్లో మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వీరి పదవీకాలం జనవరి 4తో ముగిసింది. ఎంఎస్‌ ప్రభాకర్‌రావు ఒక్కరే విప్‌ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు చీప్‌ విప్‌, విప్‌ల పదవులు పొందేందుకు సీఎం కేసీఆర్‌ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో శాసనమండలిలో అడుగు పెట్టిన బండ ప్రకాశ్‌కు మండలి వైస్‌ చైర్మన్‌ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక చీఫ్‌ విప్‌, రెండు విప్‌ పదవులు దక్కించుకునేందుకు కొందరు ఎమ్మెల్సీలు తమదైనశైలిలో పావులు కదుపుతున్నట్టు సమాచారం. మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇక ఈ జిల్లా నుంచి విప్‌ పదవులు వచ్చే అవకాశం లేదని సమాచారం.

ఇప్పటిదాకా ప్రాతినిధ్యం దక్కని జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీలకు మండలి పదవుల్లో చోటు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. శాసనసభ చీఫ్‌ విప్‌, విప్‌ పదవులకు అమలు చేసిన విధానాన్నే మండలిలోనూ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసనసభలో చీఫ్‌ విప్‌గా వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ ఉండగా ప్రభుత్వ విప్‌లుగా గువ్వల బాలరాజు, బాల్క సుమన్‌, గొంగిడి సునిత, గంప గోవర్దన్‌లను ఇది వరకే సీఎం కేసీఆర్‌ ఎంపిక చేశారు. ఇటువంటి సామాజిక సమీకరణలను మండలిలోనూ అమలు చేసి విప్‌ పదవులను భర్తీ చేయాలన్న ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement