Friday, March 29, 2024

ఊరించి, ఉసూరుమనిపించి.. కమిటీ ఎజెండా నుంచి ’ప్రత్యేక హోదా‘ తొలగింపు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రత్యేక హోదాపై కేంద్రం గందరగోళాన్ని సృష్టించి, గంటల వ్యవధిలో తూచ్.. తప్పు జరిగిందంటూ మాటమార్చింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో ఏర్పాటైన త్రిసభ్య సబ్ కమిటీ సమావేశం తేదీ, ఎజెండాను ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన మీటింగ్ నోటీసు ఈ గందరగోళానికి కారణమైంది. ఈనెల 8న కేంద్ర హోంశాఖలో డైరక్టర్ ర్యాంక్ అధికారి రేణు శరిన్ పేరిట జారీ చేసిన మీటింగ్ నోటీసులో ఈ నెల 17న ఉదయం గం. 11.00కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా త్రిసభ్య కమిటీ సమావేశం కావాలని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన, రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో ఏర్పాటైన ఈ త్రిసభ్య కమిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కృషి చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ క్రమంలో కమిటీ చర్చించాల్సిన అంశాలతో ఓ ఎజెండాను రూపొందించి, మీటింగ్ నోటీసుకు అనుబంధంగా జతపరిచింది. ఎజెండాలో మొత్తం 9 అంశాలను ప్రస్తావిస్తూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలతో సంబంధంలేని ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు వంటి వాటిని కూడా జాబితాలో పొందుపరిచింది.

  1. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్
  2. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదం
  3. పన్నుల విషయంలో తలెత్తిన లోపాలను సరిదిద్దడం
  4. బ్యాంకు డిపాజిట్లు, నగదు నిల్వల విభజన
  5. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సివిల్ సప్లైస్ కార్పొరేషన్లలోని నగదు విభజన
  6. రిసోర్స్ గ్యాప్
  7. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 వెనుకబడి జిల్లాల అభివృద్ధికి గ్రాంట్
  8. స్పెషల్ కేటగిరీ స్టేటస్
  9. పన్ను రాయితీలు

విభజన వివాదాల సబ్ కమిటీ తొలి సమావేశ ఎజెండాలో ప్రత్యేక హోదా, పన్ను రాయితీలను చేర్చడంతో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ నేతలు సహా పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ ఇన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చిన కేంద్రం, ఆ అంశంపై చర్చించడానికి సిద్ధపడడం అంటే, అది తాము సాధించిన విజయమేనని చెప్పుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగానే కాదు, ప్రత్యేక హోదా ఆశిస్తూ, డిమాండ్ చేస్తున్న బిహార్, ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈ విషయంపై విస్తృతంగా చర్చ జరిగింది.

జీవీఎల్ జోక్యంతో.. మారిన సీన్
ప్రత్యేక హోదాపై విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలో బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాల జాబితాలో ప్రత్యేక హోదా, రిసోర్స్ గ్యాప్ వంటి అంశాలను చేర్చడంపై వివరణ కోరారు. ఓవైపు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చే పరిస్థితే లేదని కేంద్రం పదే పదే చెబుతున్న సమయంలో తేనెతుట్టెను కదిలించిన చందంగా ప్రత్యేక హోదాను చర్చించాల్సిన అంశాల జాబితాలో చేర్చడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పుడు, తమ పొరపాటును గ్రహించిన కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, సవరించిన ఎజెండాతో మరొక మీటింగ్ నోటీసును జారీ చేశారు.

సవరించిన నోటీసులో…
శనివారం సవరణలతో కూడిన మీటింగ్ నోటీసు జారీ చేసిన కేంద్ర హోంశాఖ, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థికపరమైన అంశాలతో కూడిన వివాదాలను మాత్రమే పరిమితం చేసింది. ఈ క్రమంలో తొలుత జారీ చేసిన 9 అంశాల్లో ప్రత్యేక హోదా, రిసోర్స్ గ్యాప్, పన్ను రాయితీలు, వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి నిధులు వంటి అంశాలను ఎజెండా నుంచి తొలగించింది. నిజానికి కేంద్ర హోంశాఖ సవరించిన నోటీసు విడుదల చేయడానికి ముందే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ద్వైపాక్షిక స్వభావం లేని అంశాలు సమావేశంలో భాగం కాదని కేంద్ర హోంశాఖ అధికారులు తనకు స్పష్టతనిచ్చినట్టు తెలిపారు. తప్పుడు ఆశలు కలిగించి ప్రజలను తప్పుదోవపట్టించవద్దని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement