Saturday, April 20, 2024

Fooding and Monkey: పబ్‌ డ్రగ్స్‌ కేసులో నిందితులకు రిమాండ్‌.. కస్టడీ కోరిన పోలీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బంజారాహిల్స్‌ డ్రగ్స్‌ కేసులో నిందితులను కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు ఏడు రోజులు కస్టడీ కోరారు. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎంత మందికి కొకైన్‌ అందించారు? పబ్‌లో ఉన్న వారు ఎంత మంది మాదక ద్రవ్యాలు సేవించారు? గతంలో ఇలాంటి పార్టీలు ఎన్ని నిర్వహించారు? అనే అంశాలపై విచారణ చేసేందుకు పోలీసులు కస్టడీ కోరినట్లు తెలుస్తోంది. పబ్‌ మేనేజనర్‌ అనిల్‌, భాగస్వామి అభిషేక్‌లను వారం రోజులు కస్టడీ కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఏ4గా కిరణ్‌రాజ్‌ను చేర్చారు. గతంలో ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ నడిపినట్లు సమాచారం. అభిషేక్‌ ఐఫోన్‌ను సీజ్‌ చేసిన పోలీసులు.. అతని చరవాణిలో కీలక సమాచారం ఉంటుందని భావిస్తున్నారు. కస్టడీకిలోకి తీసుకున్న అనంతరం విచారణలో భాగంగా అతని కాంటాక్ట్స్‌, వాట్సాప్‌ చాటింగ్‌ తనిఖీ చేయనున్నారు.

నిందితులకు రిమాండ్‌
పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో తాజాగా మరొకరిని నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. నిన్నటి వరకు పబ్‌ మేనేజర్‌ అనిల్‌కు, భాగస్వామి అభిషేక్‌, అర్జున్‌లు ఉండగా, సోమవారంకిరణ్‌రాజ్‌ అనే వ్యక్తి పేరును చేర్చారు. వీరిలో అనిల్‌, అభిషేక్‌లను పోలీసులు ఆదివారమే అరెస్టు చేయగా, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని సోమవారం ఉదయం కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో వీరిద్దరినీ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

దర్యాప్తు వేగవంతం
పబ్‌ లోపలికి డ్రగ్స్‌ ఏ విధంగా వచ్చాయని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పబ్‌లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పబ్‌ ఉన్న రాడిసన్‌ బ్లూ హోటల్‌లోని ఫుటేజీని కూడా సేకరించారు. కేసులో ఏ1గా ఉన్న పబ్‌ భాగస్వామి అభిషేక్‌ సినీ, రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి కూడా ఈ పబ్‌ను బుక్‌ చేసుకుని వస్తుంటారని పోలీసులు గుర్తించారు. 24 గంటలూ మద్యం అందుబాటులో ఉండడం వల్ల తరచూ పార్టీలు చేసుకుంటున్నట్లు ఆధారాలు సేకరించారు. చాలా రోజులుగా ఈ పబ్‌లో ఈ తరహా పార్టీలు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

అతడే కీలకం….
ఈ పబ్‌కు అనిల్‌కుమార్‌ను పబ్‌ పార్ట్‌నర్లు మేనేజర్‌గా నియమించుకున్నారు. అనిల్‌ ఇక్కడ జరిగే ప్రతి పార్టీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్‌పై రైడ్‌ చేసే సమయంలో అతని టేబుల్‌పై మాదక ద్రవ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఐదు ప్యాకెట్లలో 4.64 గ్రాముల కొకైన్‌ ఉన్నట్లు తేల్చారు. వీటితో పాటు టిష్యూ పేపర్లు, టూట్‌ పిక్స్‌ తదితర వస్తువులు స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపారు.

వారి కోసం గాలింపు
పరారీలో ఉన్న అర్జున్‌తో పాటు కిరణ్‌రాజ్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గాలిస్తున్నాయి. కిరణ్‌రాజ్‌ గతంలో ఆ పబ్‌కు యజమానిగా పోలీసులు గుర్తించారు. 2020 ఆగస్టు నుంచి అభిషేక్‌తో పాటు అతను కూడా భాగస్వామిగా ఉన్నారని సమాచారం. ఎఫ్‌ఐఆర్‌లో ఎ4గా చేర్చిన కిరణ్‌రాజ్‌ మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి సమీప బంధువని సమాచారం. పోలీసులు పబ్‌పై రైడ్‌ చేసిన సమయంలో పబ్‌లో వీరిద్దరు లేరు. దాడి సమాచారం తెలుసుకొని పరారయ్యారని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement