Tuesday, October 8, 2024

Passport: రాహుల్‌ గాంధీకి ఊరట

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పాస్‌పోర్టు వ్యవహారంలో..కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఢిల్లీ కోర్టు ఊరట ఇచ్చింది. మూడు సంవత్సరాల పాటు సాధారణ(రెగ్యులర్‌) పాస్‌పోర్ట్‌ పొందేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఎన్‌వోసీ ఆదేశాలు జారీ చేసింది. ఎంపీగా పార్లమెంట్‌ అనర్హత వేటు ఎదుర్కొన్న రాహుల్‌ గాంధీ.. తన డిప్టోమేటిక్‌ పాస్‌పోర్ట్‌ను తిరిగి అప్పగించారు. పాస్‌పోర్టుతో పాటు అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం కొత్త పాస్‌పోర్టు(సాధారణ) దరఖాస్తు చేసుకునేందుకు నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్ కోసం రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారాయన. అందుకు కారణం.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఆయన నిందితుడిగా ఉండడమే.

బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన మనీలాండరింగ్‌, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసు ఇది. దీంతో రెగ్యులర్‌ పాస్‌పోర్టు కోసం ఆయన ఎన్‌వోసీ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఇవాళ కోర్టు ఆదేశాలిస్తూ అయితే రాహుల్‌ కోరినట్లు పదేళ్లకు కాకుండా మూడేళ్లకు మాత్రమే సాధారణ పాస్‌పోర్ట్‌ కోసం ఎన్‌వోసీ ఇస్తున్నట్లు తెలిపింది. అంతకు ముందు బుధవారం విచారణ సందర్భంగా.. పాస్‌పోర్టు నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోరుతూ గాంధీ చేసిన అభ్యర్థనపై శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలని బీజేపీ మాజీ ఎంపి స్వామిని కోర్టు కోరింది. ఇక ఇవాళ్టి తీర్పు సందర్భంగా.. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వైభవ్ మెహతా ప్రయాణించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రయాణాలపై కోర్టు ఆంక్షలు విధించలేదని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement