Thursday, May 26, 2022

KTR: త్వరలో మున్సిపాలిటీల్లో నియామకాలు

తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ రాష్ట్రం అని ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే సుమారు 46 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారన్నారు. 5 నుంచి 6 సంవత్సరాలో సగానికి పైగా జనాభా తెలంగాణలో పట్టణాల్లో నివసించపోతున్నది వెల్లడించారు. త్వరలో మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని పూర్తి చేస్తామని ప్ర‌క‌టించారు. పురపాలికల్లో వార్డ్ ఆఫీసర్ల వ్యవస్థ, ఇందుకు సంబంధించిన సిబ్బంది నియామకం త్వరలో పూర్తి అవుతుంద‌న్నారు. న‌గ‌రంలోని వెంగ‌ళ్రావున‌గ‌ర్‌లో నిర్వ‌హించిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంపై మేయ‌ర్లు, చైర్మ‌న్ల‌కు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఉత్తమ అవకాశాలు, వసతుల కోసం ప్రజలు పట్టణాలకు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతుల కల్పన అత్యంత సవాలుగా మారిందన్నారు. భారతదేశాన్ని నడిపిస్తున్నది మాత్రం పట్టణాలే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు 68గా ఉన్న వాటిని 142కు పెంచామన్నారు. నూతన పురపాలక చట్టం తీసుకువచ్చి ప్రజల కేంద్రంగా అనేక సంస్కరణలను చేపట్టామన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ప్ర‌తి ప‌ట్ట‌ణంలో మోడ‌ల్ మార్కెట్లు, డిజిట‌ల్ డోర్ నంబ‌రింగ్, ఆధునిక దోబీ ఘాట్‌లు, మాన‌వ వ్య‌ర్థాల శుద్ధి, నిర్వ‌హ‌ణ ప్లాంట్, మోడ‌ల్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, వైకుంఠ‌ధామాలు, ప్ర‌తి ఇంటికి న‌ల్లా క‌నెక్ష‌న్, బ‌యో మైనింగ్ వంటి ల‌క్ష్యాల‌ను పురపాలికలు సాధించాలన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్దేశించిన హరితహారానికి సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం చట్టప్రకారం నిర్దేశించిన టీఎస్ బీపాస్ ప్రకారం 21 రోజుల్లోనే అనుమ‌తులు ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ విషయంలో అధికారులు కానీ, ప్ర‌జాప్ర‌తినిధులు కానీ అవకతవకలకు పాల్పడితే, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్ప‌వ‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. ఇప్పటికే పట్టణాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో అద్భుతమైన ప్రగతి కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి పురపాలిక తన ప్రగతి ప్రస్థానం పైన ఒక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రతి పురపాలికల్లో చేపట్టిన అభివృద్ధిని నగర పౌరుల ముందు ఉంచేలా చర్యలు తీసుకోవాల‌ని కేటీఆర్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement