Thursday, April 25, 2024

కరోనాతో ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ కన్నుమూత

కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను అతలాకుతలం చేస్తోంది. సామాన్య ప్రజలతో పాటు చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నేతలను కూడా కరోనా బలి తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రీయ‌ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) పార్టీ అధినేత  చౌదరి  అజిత్ సింగ్ క‌రోనాతో మరణించారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. అజిత్ సింగ్ ఏప్రిల్ 22న కరోనా బారినపడ్డారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో వైద్యుల సలహా మేరకు గురుగ్రామ్‌ లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం అజిత్ సింగ్ కన్నుమూశారు. అజిత్ మృతి పట్ల పలు పార్టీలకు చెందిన నేతలు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్.. యూపీలోని బాగ్‌ పత్ లోక్‌సభ నియోజవర్గం నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. గతంలో పౌరవిమానయానశాఖ మంత్రిగానూ పనిచేశారు. అజిత్ సింగ్ తండ్రి చరణ్ సింగ్..1979-80లో ఆరు నెలల పాటు భారత ప్రధానిగా సేవంలందించారు. అజిత్ ఉన్నత చదువులు చదువుకున్నారు. తండ్రి అడుగు జాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. పశ్చిమ యూపీలోని జాట్ సామాజికవర్గంలో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి బలమైన పట్టుంది. కాంగ్రెస్, బీజేపీలో పొత్తుపెట్టుకొని కేంద్రంలో పలు మార్లు కేంద్రమంత్రిగానూ అజిత్ సింగ్ పనిచేశారు. మొదట విపీ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత పీవీ నరసింహారావు కేబినెట్‌ లో ఫుడ్ మినిస్టర్‌గా పనిచేశారు. 1996లో కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి.. ఆర్ఎల్డీ పార్టీని స్థాపించారు. అనంతరం ఎన్డీయేలో చేరారు. 2001లో వాజ్‌ పేయీ ప్రభుత్వంలో వ్యవసాయమంత్రిగా పనిచేశారు. 2003లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారు. కాగా, అజిత్ సింగ్ మృతిపై పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement