Saturday, June 12, 2021

స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

టీఆర్ఎస్ పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నాన‌ని మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ ఎమ్మెల్యే పదవికి కూడా ఇవాళ రాజీనామా చేయనున్నారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఈ రోజు లేఖ‌ను అందించ‌నున్నారు. ముందుగా హైద‌రాబాద్ నాంపల్లిలోని అసెంబ్లీ ముందు ఉండే గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపానికి ఆయ‌న‌ నివాళులు అర్పించనున్నారు. అనంత‌రం అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌ రెడ్డిని కలిసి రాజీనామా అందించనున్నారు.

టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నిన్న ప్రకటించారు. ఆ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నట్లు చెప్పారు. తనకు ఎమ్మెల్యే, మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లుగా కొందరు నాయకులు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. పదవులు ఇవ్వమని తానెప్పుడూ అడగలేదన్నారు. ఏ పదవి ఇచ్చినా సంపూర్ణంగా న్యాయం చేశానని, తనను ఎమ్మెల్యేగా ఎలా తొలగించాలా అని ఆలోచన చేస్తున్నారని తెలిసిందన్నారు. మీరు తొలగించేలోగా తానే వదులుకుంటానని ఈటల ప్రకటించారు. ఈటలతోపాటు కరీంనగర్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు గండ్ర నళిని, లత, అందె బాబయ్య, బీకే మహేశ్‌, హనుమంతరావు, శ్రీదేవి తదితరులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈట‌ల రాజేంద‌ర్ త్వ‌ర‌లోనే బీజేపీలో చేరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News