Thursday, April 25, 2024

TS: రాజగోపాల్​రెడ్డి చేరికలో క్విడ్​ ప్రొకో ఉంది.. అందుకే 18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారన్న కాంగ్రెస్​

మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్​ పార్టీ కొత్త విషయాలను తెరమీదికి తీసుకొచ్చింది. ఇవ్వాల (ఆదివారం) మీడియాతో మాట్లాడుతూ ఆ పార్టీ నేత మధుయాష్కీ గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డితోపాటు బీజేపీ పార్టీపై పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్​రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు క్విడ్​ ప్రొ కో తరహాలో కాంట్రాక్టు కట్టబెట్టారని మధుయాష్కీ ఆరోపించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌కు కాంట్రాక్టులు ఇచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ పేర్కొంది. రాజగోపాల్​రెడ్డి భార్య లక్ష్మి, కుమారుడు సంకీర్త్ రెడ్డి వాటాదారులుగా ఉన్న సుషీ ఇన్‌ఫ్రాకు చంద్రగుప్త బొగ్గు గనులను క్విడ్‌ ప్రోకో డీల్‌గా కేటాయించారని కాంగ్రెస్‌ నేత మధు యాష్కీ గౌడ్‌ విలేకరుల సమావేశంలో అన్నారు.

బొగ్గు కాంట్రాక్టు ద్వారా రాజగోపాల్​రెడ్డి కుటుంబానికి రూ.18,262 కోట్ల ఆదాయం సమకూరుతుందని మధు యాష్కీ తెలిపారు. రాజగోపాల్​రెడ్డి బీజేపీలో చేరతానని చెప్పగానే కేంద్రం తొలి టెండర్‌ను రద్దు చేసి, కొత్త టెండర్‌ను ఆహ్వానించిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. 2022 మార్చిలో తుది ఒప్పందం కుదిరిందని, అప్పుడే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారని పలు ఆధారాలు చూపారు.

కాగా, రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుషీ ఇన్‌ఫ్రా సంస్థ మునుగోడు నియోజకవర్గంలోని వ్యక్తులు, వ్యాపార సంస్థల బ్యాంకు ఖాతాలకు 5.22 కోట్ల రూపాయలను బదిలీ చేసిందని ఇటీవల అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఆరోపించింది. ఇక.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.  

Advertisement

తాజా వార్తలు

Advertisement